/rtv/media/media_files/2025/10/06/jubilee-hills-by-poll-2025-10-06-19-46-05.jpg)
Jubilee Hills By Poll
Jubilee Hills By Poll : మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ లు తమ సత్తా చాటుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నిజానికి ఈ ఎన్నిక మూడు పార్టీల భవిష్యత్తును తేల్చనుండటంతో ఆయా పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికలు అధికార పార్టీకి పెనుసవాలుగా మారగా, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో నిలిచి రాష్ర్టంలో ప్రత్యామ్నయం తామేనని నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది.
సిట్టింగ్ సీటు కోసం బీఆర్‌ఎస్ పోరు..
తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌కు గత ఎన్నికలు బిగ్ షాక్ ఇచ్చాయి. రాష్ర్టమంతా వ్యతిరేక పవనాలు వీచడంతో అధికారం కోల్పొవలసి వచ్చింది. అయితే అదే సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం తన సత్తా చాటింది. నగరంలో అన్ని సీట్లలోనూ విజయం సాధించి అధికార పార్టీకి సవాలు విసిరింది. దీంతో నగరంలో అధికార పార్టీకి ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఒక సీటు గెలవక సతికిలపడింది.ఆ తర్వాత బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అందులో జీహెచ్‌ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు కార్పోరేటర్లు సైతం కాంగ్రెస్‌లో చేరారు. దీంతో నగరంలో బీఆర్‌ఎస్ బలహీనపడిందన్న ప్రచారం ఉంది.
అయితే గడచిన రెండెళ్లలో అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజల నుంచి వ్యతిరేకతను మూట గట్టుకున్నాయి. ఈ తరుణంలోనే బీఆర్‌ఎస్ అధికార పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించిన పలు ఆందోళనలు విజయ వంతం కావడంతో బీఆర్‌ఎస్ కొంత ఉత్సాహంగా ఉంది. ఈ క్రమంలోనే మాగంటి గోపినాథ్ మృతితో ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలవాల్సి వచ్చింది. సిట్టింగ్ స్థానం కావడం, సీటును గోపినాథ్ భార్య సునీతకు కేటాయించడం, నియోజకవర్గంలో గోపినాథ్ పట్ల ఉన్న సదాభిప్రాయం, సానుభూతి, అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకత. హైడ్రా బీఆర్‌ఎస్‌కు కలిసివచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ నాయకులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాక హరీష్‌రావు, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు. మాగంటి సునీతతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్ విజయం పై ధీమాతో ఉంది.
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలిస్తే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అంతేకాక జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు, అలాగే స్థానికంగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్, ఇతర కార్పోరేటర్లు కాంగ్రెస్ లో చేరినప్పటికీ బీఆర్‌ఎస్ పై ఎలాంటి ప్రభావం చూపలేదని నిరూపించుకోవచ్చు. అలాగే అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని చెప్తున్న బీఆర్‌ఎస్ వాదనకు బలం చేకూరే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌కు కత్తిమీద సాము
జాబ్లీహిల్స్ ఎన్నికను అధికార పార్టీ సవాలుగా తీసుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు నియోజకవర్గంలో తిష్ట వేసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మన్ కుమార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఇప్పటికే విస్తృత ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి కార్యకలపాలు, పార్టీలో నెలకొన్న విభేదాలు, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు, ఉచిత బస్సు తదితర అంశాలను ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక తమపార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని, అభివృద్ధి జరుగుతుందని ప్రచారం చేసే అవకాశం ఉంది.
నియోజకవర్గంలో సీటు కోసం నవీన్‌యాదవ్, బొంతురామ్మోహన్, సీఎన్ రెడ్డి, కంజర్ల విజయలక్ష్మీ, అజహారుద్దీన్, మురళీ గౌడ్ తదితరులు ప్రయత్నిస్తున్నప్పటికీ నవీన్‌యాదవ్, బొంతురామ్మోహన్, సీఎన్ రెడ్డిలలో ఒకరికి సీటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే 42 శాతం బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకే టికెట్ కేటాయిస్తుందన్న ప్రచారంతో నవీన్,లేదా బొంతు రామ్మోహన్‌కు సీటు దక్కవచ్చని తెలుస్తోంది. అయితే మిగిలిన వారు వారి విజయానికి సహకరిస్తారా లేదా అనేది తెలియదు. అధికార పార్టీ కావడంతో తమ విజయం నల్లేరు మీద నడకే అని కాంగ్రెస్ భావిస్తోంది. అంతకు ముందు కంటోన్మెంట్‌లో సాధించిన విజయం స్థాయిలోనే విజయం సాధిస్తామని ఆ పార్టీ భావిస్తోంది. ఒక వేళ ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే రేవంత్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు ప్రజలనుంచి సానుకూలత లభించినట్లేనని చెప్పవచ్చు. అలాగే రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది.
ప్రత్యామ్నాయమని నిరూపించుకోవాలని..
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుంది. రాష్ర్టంలో గత ఎన్నికల్లో 8 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ రాష్ర్టంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు తామే ప్రత్యామ్మాయమని చెప్పుకుంటుంది. ఈ క్రమంలో జాబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించకున్న కనీసం రెండో స్థానంలో నిలిచి రాష్ర్టంలో ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ఇవ్వాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, లంకల దీపక్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్ పార్టీ మహిళ అభ్యర్థిని రంగంలోకి దించడంతో బీజేపీ కూడా అదే సెంటిమెంట్‌ను అమలు చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మలలో ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశాడు. కానీ మూడో స్థానానికే పరిమితమయ్యారు. అయితే ఆయన ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు ఉప ఎన్నిక టికెట్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అయితే పార్టీ ఇప్పటివరకు అభ్యర్థిని ఎంపిక చేయకపోవడంతో పాటు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించకపోవడంతో కాస్తా వెనుకబడి ఉంది. అయితే నగరానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం, రాంచంద్రరావు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత వస్తున్న తొలి ఎన్నికలు కావడంతో బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే భావిస్తుంది.
Also Read: ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది పర్వతారోహకులు