Jubilee Hills By Poll 2025: నవీన్ యాదవ్ Vs సునీత Vs దీపక్ రెడ్డి.. ఎవరి బలం ఎంత? బలహీనతలు ఏంటి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థుల బలాలు, బలహీనతల వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
Jubilee Hills By elections 2025 BJP BRS Congress Candidates Profile

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025) తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమకు ఇక తిరుగులేదని చాటాలని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం మంత్రులు, పార్టీ యంత్రాంగం మొత్తం జూబ్లీహిల్స్ బస్తీల్లో దించింది హస్తం పార్టీ. సొంత సీటులో మరోసారి పాగా వేసి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనన్న వాతావరణం తీసుకురావాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందుకోసం అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నేతలందరినీ మోహరించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్(bjp-vs-congress) తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. జూబ్లీహిల్స్ లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. మరో ఒకటి రెండ్రోజుల్లో తమ బలగాన్నంతా జూబ్లీహిల్స్ కు తరలించి ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు స్కెచ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రధాన పార్టీల అభ్యర్థల బలాలు, బలహీనతలపై స్పెషల్ స్టోరీ.. 

Also Read :  RTV Ravi Prakash: ఇది ఎయిర్‌పోర్టా? చేపల మార్కెటా?: RGIAపై రవి ప్రకాష్‌ ట్వీట్ వైరల్!

మాగంటి సునీత(BRS)..

బలాలు:

1. భర్త మాగంటి గోపినాథ్ మృతితో సెంటిమెంట్
2. గెలుపు కోసం కేటీఆర్, హరీష్‌ రావు, సిటీ ముఖ్య నేతలు తలసాని, పద్మారావు గౌడ్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలగాలను బీఆర్ఎస్ మోహరించడం
3. టీడీపీ క్యాండిడేట్ లేకపోవడంతో ఆ పార్టీ ట్రెడిషనల్, సెటిలర్ ఓటు బ్యాంకు కలిసివచ్చే ఛాన్స్
4. గతంలో భర్త గోపినాథ్ ద్వారా వివిధ పథకాలు పొందిన వారు, లబ్ధి పొందిన వారు అండగా నిలిచే అవకాశం
5. కొన్ని వర్గాల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత, హైడ్రాపై భయం

బలహీనతలు:

1. రహమత్ నగర్ కార్పోరేటర్ సీఎన్ రెడ్డి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు కార్పొరేటర్లు పార్టీని వీడడం
2. మాగంటి కుటుంబంలో విభేదాలు ఉన్నాయన్న వార్తలు, గోపినాథ్ సోదరుడు వజ్రానాథ్ సహకరించకపోవడం
3. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించడం
4. ఈ సారి MIM పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తుందన్న ప్రచారం
5. బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో ఆయన సపోర్ట్ పై అనుమానాలు

నవీన్ యాదవ్(కాంగ్రెస్)..

బలాలు:

1. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ అభ్యర్థి కావడం.. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీల చుట్టూ పాలిటిక్స్ సాగుతుండడం
2. గతంలో రెండు సార్లు ఓడిపోయాడన్న సెంటిమెంట్.. సేవా కార్యక్రమాలు
3. సినిమా వాళ్ల సపోర్ట్.. తండ్రికి నియోజకవర్గంతో 40 ఏళ్లకు పైగా సంబంధం
4. కొన్ని రోజులుగా నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలు, భారీగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన
5. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం.. ఆ వర్గాల నుంచి మంచి సపోర్ట్ ఉండడం

బలహీనతలు:

1. తండ్రిపై రౌడీ షీటర్ నమోదు కావడం.. ప్రతిపక్షాలు ఆ విషయాన్ని అస్త్రంగా చేసుకోవడం..
2. సోదరుడిపై కూడా ఇదే రకమైన ఆరోపణలు రావడం.. 
3. టికెట్ ఆశించి భంగపడ్డ అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్ సపోర్ట్ పై అనుమానాలు
4. ఇంకా సీరియస్ గా ప్రచారం ప్రారంభించకపోవడం
5. బీఆర్ఎస్ కు ధీటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకోలేకపోవడం

Also Read :  ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి

దీపక్ రెడ్డి(BJP)..

బలాలు:

1. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం.. 
2. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్, మాగంటి గోపినాథ్ ఇద్దరూ ఇప్పుడు బరిలో లేకపోవడం.. దీపక్ రెడ్డి మినహా బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ కొత్త వారే కావడం 
3. టీడీపీతో రాజకీయ ప్రవేశం చేయడంతో ఆ పార్టీ శ్రేణులు సపోర్ట్ చేసే ఛాన్స్ 
4. అర్బన్ నియోజకవర్గం కావడం, ఎక్కువ మంది చదువుకున్న ఓటర్లు ఉండడంతో బీజేపీకి కలిసి వస్తుందన్న నమ్మకం
5. కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం

బలహీనతలు:

1. టికెట్ ఆలస్యంగా ప్రకటించడం
2. షెడ్యూల్ వచ్చిన తర్వాత రఘునందన్ రావు మినహా మిగతా అగ్రనేతలెవరూ నియోజకవర్గంలో పెద్దగా పర్యటించకపోవడం
3. బీజేపీలో వర్గవిభేదాలు.. 
4. ఆ పార్టీ ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకోవడం లేదన్న ప్రచారం బలంగా ఉండడం.. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు మాదిరిగా ఇక్కడ ఫోకస్ పెట్టకపోవడం
5. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించేందుకు బీజేపీ పని చేస్తోందన్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఫెయిల్ కావడం

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల లెక్కలు:

మొత్తం ఓటర్లు: 3,98,982

బీసీలు: 1.50-1.80 లక్షలు

ముస్లింలు: 96,500

ఎస్సీలు: 26,000

కమ్మ: 17,000

రెడ్డి: 18,000

యాదవులు: 15,000

క్రిస్టియన్లు: 10,000

పురుషులు: 2,07,367

మహిళలు: 1,91,590

ఇతరులు:25

కొత్త ఓటర్లు:12,380 (18-19 ఏళ్లు)

30 ఏళ్ల లోపు ఓటర్లు:29,880

సెటిలర్లు: 34000-40000

Advertisment
తాజా కథనాలు