IndiGo Crisis: మరో 400 విమాన సర్వీసులు రద్దు..అయ్యప్ప భక్తులు ఏం చేశారంటే..?

 గడచిన మూడు రోజులుగా  నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విమానాలను సడెన్‌గా రద్దు చేయడంతో  ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి.

New Update
FotoJet - 2025-12-05T112427.312

Another 400 flights cancelled

IndiGo Crisis :  గడచిన మూడు రోజులుగా  నిర్వహణపరమైన లోపాల కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విమానాలను సడెన్‌గా రద్దు చేయడంతో  ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా.. శుక్రవారం మరో 400కు పైగా విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణీకుల ఇక్కట్లు మరింత పెరిగాయి. రద్దయిన వాటిలో సగానికి పైగా విమానాలు ఒక్క ఢిల్లీ విమానాశ్రయానికి చెందినవి కావడం గమనార్హం.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే 220కి పైగా ఇండిగో  విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే బెంగళూరులో 100,  హైదరాబాద్‌ విమానాశ్రయంలో 90కి పైగా విమాన సర్వీసులను ఎయిర్‌లైన్‌ రద్దు చేసినట్లు ఇండిగో యాజమాన్య వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఇతర ప్రధాన ఎయిర్‌పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆయా విమానశ్రయాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు గంటలతరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది.

ప్రయాణీకుల ఇబ్బందులు

చాలా విమానాశ్రయాల్లో మూడు రోజులుగా  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో కౌంటర్లు పూర్తిగా ఖాళీగా ఉన్నాయని, ఎయిర్‌లైన్‌ సిబ్బంది తమను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణీకులకు ఆహారం, నీరు కూడా ఇవ్వట్లేదని వాపోతున్నారు. మరోవైపు, తమ లగేజీలను తీసుకునేందుకు 12 గంటలకు పైగా సమయం పడుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌లో సరైన చోటు లేక.. చాలామంది నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఇలా కొనసాగుతుండగా స్టాక్‌ మార్కెట్లలో ఇండిగో షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. గత ఐదు సెషన్లలో 9 శాతానికి పైగా కుంగాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ఇండిగో షేరు ధర 2.16 శాతం తగ్గి రూ.5,319 వద్ద కొనసాగడం గమనార్హం.

దిద్దుబాటు చర్యలు

కాగా వరుస వైఫల్యాల నేపథ్యంలో IndiGo  దిద్దుబాటు చర్యలకు దిగింది... డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)ను ఆశ్రయించింది. ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ (FDTL) నిబంధనల నుంచి ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలకు మినహాయింపు కల్పించాలని ఎయిర్‌లైన్‌ సంబంధిత అధికారులను కోరింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఈ ఉపశమనం ఇవ్వాలని ఇండిగో కోరినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, దీనిపై డీజీసీఏ (DGCA) తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.

మరోవైపు విమానాల ఆలస్యం, రద్దుపై ఇండిగో సంస్థ స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి ఇండిగో (IndiGo) విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెబుతున్నారు. ఈనెల 8 నుంచి విమానాలను తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఈ అసౌకర్యానికి గానూ ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ క్షమాపణలు తెలియజేసింది.


ప్రయాణీకుల ఆందోళన

ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు  వెళ్లాల్సినవి 49 ఉన్నాయి. ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌ఇన్‌ అయిన తర్వాత రద్దు సమాచారం ఇవ్వడంపై నిరసన తెలిపారు. మరోవైపు విశాఖ నుంచి 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌కు వెళ్లాల్సినవి ఉన్నాయి.  

ఇదిలా ఉండగా..

 శబరికి వెళ్లాల్సిన భక్తుల ఇబ్బందులు తెలుసుకున్న ఏపీ మంత్రి పార్థసారథి జోక్యం చేసుకోవడంతో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ప్రత్యేక విమాన సదుపాయాన్ని కల్పించారు. అంతకుముందు విజయవాడ వెళ్లేందుకు శంషాబాద్‌లో ఇండిగో విమానం కోసం పార్థసారథి చాలా సేపు వేచి ఉన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు ప్రయాణించే విమానం ఆలస్యంపై అడిగి తెలుసుకున్నారు. వారి ఆందోళనను గమనించి స్వయంగా కేంద్రమంత్రి రామ్మోహన్‌తో పోన్‌లో మాట్లాడారు. శబరిమలకు విమాన సర్వీసు ఏర్పాటు చేయించారు. విజయవాడకు వెళ్లాల్సిన విమానం మిస్‌ కావడంతో మంత్రి పార్థసారథి రోడ్డు మార్గంలో బయలుదేరారు. తమకోసం శ్రమపడి ప్రయాణ సదుపాయం కల్పించిన ఆయనకు అయ్యప్ప భక్తులు ధన్యవాదాలు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు