తెలంగాణలో ఈసారి ఆశించిన దానికంటే ఎక్కువ వర్షాలే కురిశాయి. రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆగస్టు తప్ప.. జూన్ నుంచి అక్టోబర్ వరకు అన్ని నెలల్లోనూ భారీ వర్షాలే పడ్డాయి. అక్టోబర్ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన మూడు అల్పపీడనాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా.. తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: ఉగ్రవాదిని పట్టించిన కుక్క బిస్కెట్లు!
Rains In Telangana
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. రంగారెడ్డి, నల్లగొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట, హైదరాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కొన్ని జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశలో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని చెప్పారు.
Also Read: ఏపీలో ఫించన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్షన్ ఒకేసారి!
వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ఏపీలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
Also Read: Hyderabad లో జరగనున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు.. ఎప్పటినుంచంటే ?
నైరుతి బంగాళాఖాతంలో నవంబర్ 6, 7 తేదీల్లో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటుగా తమిళనాడులోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో, తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో సైతం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు.
Also Read: సిద్ధిఖీలా నిన్ను చంపేస్తామంటూ.. సీఎంను బెదిరించిన యువతి అరెస్ట్
ఈనెల 6 తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా, గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడగా.. తాజాగా మరో అల్పపీడనం ముప్పు పొంచి ఉండటంతో తీర ప్రాంతాల అధికారులు అప్రమత్తం అయ్యారు.