/rtv/media/media_files/2026/02/24/gachibowli-real-estate-2026-02-24-08-09-13.jpg)
హైదరాబాద్ రియల్ ఎస్టేట్(hyderabad-real-estate) రంగంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా తెలంగాణ హౌసింగ్ బోర్డు నిర్వహించిన ప్లాట్ల బహిరంగ వేలంలో గజం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. నగరంలోని గచ్చిబౌలి(gachibowli) ప్రాంతంలో చదరపు గజం ధర ఏకంగా రూ. 1.76 లక్షలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. సోమవారం రోజున కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్‌లో జరిగిన ఈ వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు ఉత్సాహంగా పాల్గొని పోటీ పడ్డారు. గచ్చిబౌలి, బాచుపల్లి, కూకట్‌పల్లి, చింతల్ వంటి ప్రముఖ ప్రాంతాల్లోని ప్లాట్ల కోసం కొనుగోలుదారులు భారీగా పోటీ పడటంతో హౌసింగ్ బోర్డు స్థలాలకు మరోసారి భీభత్సమైన డిమాండ్ ఉందని స్పష్టమైంది.
Also Read : మార్చి 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 20న రాష్ట్ర బడ్జెట్!
263 చదరపు గజాల ప్లాట్‌కు
ఈ వేలం వివరాలను గమనిస్తే, గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల ప్లాట్‌కు కనీస ధరగా గజానికి రూ. 50 వేలు నిర్ణయించగా, వేలంలో అది రూ. 1.76 లక్షల వద్ద ముగిసింది. అదేవిధంగా కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లోని 266 చదరపు గజాల ప్లాట్ గజానికి రూ. 1.64 లక్షల ధర పలికి రికార్డు సృష్టించింది. నిజాంపేటలోని సిద్ది ప్లాట్ విషయంలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. అక్కడ కనీస ధర రూ. 15 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో రూ. 17.70 లక్షలకు విక్రయించబడింది. చింతల్ ప్రాంతంలో కూడా గజం ధర రూ. 84 వేల నుండి రూ. 74 వేల వరకు పలికి మంచి డిమాండ్‌ను కనబరిచింది.
మొత్తంగా గచ్చిబౌలి, బోరంపేట్, బాలాజీ నగర్, చింతల్ వంటి 14 ప్రాంతాల్లోని ప్లాట్లను విక్రయించడానికి హౌసింగ్ బోర్డు ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్లాట్లు ప్రధానంగా ఎంఐజీ (MIG), హెచ్‌ఐజీ (HIG) కేటగిరీలకు చెందినవి కావడంతో వీటిని దక్కించుకోవడానికి రియల్టర్లు, సాధారణ ప్రజలు పోటీ పడ్డారు. సోమవారం జరిగిన ఈ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 34.27 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు హౌసింగ్ బోర్డు ఎండీ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నగరంలో భూములకు ఉన్న క్రేజ్ చూస్తుంటే రానున్న రోజుల్లో సామాన్యులకు ఇల్లు లేదా స్థలం కొనడం మరింత భారమయ్యేలా కనిపిస్తోంది.
Also Read : తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఎంట్రన్స్ పరీక్ష షెడ్యూల్ ఇదే.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?
Follow Us