/rtv/media/media_files/2026/02/23/tg-edcet-2026-2026-02-23-18-54-16.jpg)
TG EdCET 2026
TG EdCET 2026 : తెలంగాణలో బీఎడ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు నిర్వహించే ప్రవేశాలకు సబంధించి నిర్వహించే తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EDCET) 2026 పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ ను తెలంగాణ ఎడ్‌సెట్ 2026 చైర్మన్ విడుదల చేశారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాశాఖ గుర్తించిన బీఎడ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎడ్‌సెట్ 2026 చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (VC) ప్రొఫెసర్ కె. ప్రతాప్‌రెడ్డి షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేశారు. కాగా బీఎడ్ కోర్సు చేయాలనుకునే అభ్యర్థులకు దరఖాస్తు తేదీలు, ఆలస్య రుసుము, గడువు, పరీక్ష తేదీ, ఫలితాల విడుదల తేదీలను ఆయన స్పష్టంగా వివరించారు.
నేటి నుంచే దరఖాస్తులు
కాగా, ప్రతాప్ రెడ్డి ప్రకటించిన షెడ్యూల్ ను బట్టి తెలంగాణ ఎడ్‌సెట్-2026కు దరఖాస్తులు ఫిబ్రవరి 23వ తేదీ అంటే ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. ఈ దరఖాస్తులు ఏప్రిల్ 15 వరకు కొనసాగుతాయి. ఈ గడువులో అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వంటి వివరాలను సరైన విధంగా అప్‌లోడ్ చేయాలని ఆయన సూచించారు. నిర్దిష్ట గడువులో దరఖాస్తు చేయలేని అభ్యర్థులకు ఆలస్య రుసుముతో కూడా అవకాశం కల్పించనున్నామని వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 వరకు రూ.250 ఆలస్య రుసుముతో , ఏప్రిల్ 27 వరకు రూ.500 ఆలస్య రుసుముతో , ఏప్రిల్ 30 వరకు రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని చైర్మన్ సూచించారు. ఈ విధంగా అభ్యర్థులకు అదనపు సమయం ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
ఆన్‌లైన్ విధానంలో పరీక్ష..
కాగా గతంలో మాదిరిగా TG EDCET 2026 ప్రవేశ పరీక్ష లిఖితపూర్వకంగా కాకుండా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. మే 12వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ విధానంలో కొనసాగుతుంది. ఈ పరీక్ష ఉదయం సెషన్, మధ్యాహ్నం సెషన్ లుగా రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులకు కేటాయించిన సెషన్ వివరాలు హాల్ టికెట్‌లో పొందుపరుస్తారు. పరీక్షలో అభ్యర్థుల బోధనా సామర్థ్యం, సాధారణ జ్ఞానం, సబ్జెక్ట్ పరిజ్ఞానం వంటి అంశాలను పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి.
మే 30న ఫలితాలు..
కాగా మే 12న నిర్వహించే TG EDCET 2026 పరీక్ష ఫలితాలను మే 30వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించనున్నారు. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని నిర్వహకులు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫలితాల ఆధారంగా ర్యాంకులు పొందుపరుస్తారు. ఈ ర్యాంకుల ప్రకారం బీఎడ్ కాలేజీల్లో సీట్లు కేటాయించే అవకాశం ఉంటుంది.
Follow Us