/rtv/media/media_files/2025/09/06/balapur-ganesh-laddu-auction-2025-09-06-06-52-32.jpg)
Balapur Ganesh Laddu Auction
నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్ లోని మహా గణపతి శోభయాత్ర(Khairatabad Maha Ganapati Shobha Yatra) ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం(balapur-ganesh-laddu-auction). ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ కోట్లల్లో వేలం పాడుతున్నప్పటికీ బాలాపూర్ ప్రత్యేకత బాలాపూర్‌దే. బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత తొలి శోభాయాత్ర ఇక్కడినుంచే ప్రారంభమవుతుంది. బాలాపూర్ లడ్డూ వేలానికి సుమారు మూడ దశాబ్ధాల చరిత్ర ఉంది.
గత ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం రూ.30,01,000 ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి ఈ బాలాపూర్ లడ్డూను వేలం పాట ద్వారా కొనుగోలు చేశారు. అంతకు ముందు ఏడాది ఇదే బాలాపూర్ లడ్డూ రూ. 27 లక్షల ధర పలికింది. నాడు ఈ లడ్డును దాసరి దయానంద్ రెడ్డి వేలంపాటలో దక్కించుకున్నారు.
ఎప్పుడు ప్రారంభమైందంటే?
బాలాపూర్ తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం సమీపంలో ఉన్న గ్రామం. దశాబ్దాలుగా బాలాపూర్‌లో గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది.అయితే1994లో తొలిసారి బాలాపూర్ లడ్డును వేలం వేశారు. ఈ లడ్డూను స్థానికుడు, వ్యవసాయదారుడు అయిన కొలను మోహన్ రెడ్డి కుటుంబం రూ. 450కి దక్కించుకుంది. ఈ లడ్డును గ్రామస్తులకు ప్రసాదంగా పంచడంతో పాటు... మిగిలిన ప్రసాదాన్ని పొలంలో చల్లాడు. ఆ ఏడాది ఆయన ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. దీంతో కొలను మోహన్ రెడ్డి కుటుంబం లడ్డూ వేలం పైన దృష్టి కేంద్రీకరించింది. ఆ తర్వాత ఏడాది.. అంటే 1995లో కూడా నిర్వహించిన వేలం పాటలో బాలాపూర్ లడ్డును రూ. 4500కు ఆయనే దక్కించుకున్నాడు. అనంతరం ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా ఎదిగింది. దీంతో బాలాపూర్ లడ్డూకు చాలా మహిమ ఉందని స్థానికుల్లో నమ్మకం ఏర్పడింది. అలా ప్రతి ఏడాది వందల నుండి వేలకు, వేలు నుండి లక్షలకు ఈ బాలాపూర్ లడ్డూ వేలం పాట చేరుకుంది.
బాలాపూర్ గణేష్ అంటే ఉత్సవాలకంటే అందరికీ గుర్తొచ్చేది అక్కడి లడ్డూ వేలం పాటే. ఇక్కడ విగ్రహం ఎత్తు కంటే.. బాలాపూర్ గణేషుడి చేతిలో ఉంటే లడ్డూపైనే అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే, వేలం పాటలో ఆ లడ్డూ బద్దలుకొట్టబోయే రికార్డుల కోసం ఎదురుచూస్తుంటారు భక్తులు. బాలాపూర్ లడ్డూని దక్కించుకునేందుకు ఎంతోమంది పోటీపడుతుంటారు. లక్షలు రూపాయలైనాసరే లడ్డూను సొంతం చేసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు.1994లో కేవలం 450 రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ.. 1994 నుంచి 2001 వరకు వేలల్లో మాత్రమే ఉంది.. 2002 నుంచి లక్షల్లోకి చేరింది. ఎప్పటికప్పుడు తన రికార్డులనే తానే బ్రేక్ చేసుకుంటూ బాలపూర్ లడ్డూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గతేడాది 30 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈసారి ఎంత పలుకుతుందనే ఉత్కంఠ నెలకొంది.
అయితే గతంలో లాగా కాకుండా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో రూల్ మారింది. వేలంలో పాల్గొనాలనుకునేవారు గతేడాది వేలం మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. అంటే, 30 లక్షల రూపాయల ధరావత్తు కడితేనే లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఒకపుడు ఈ రూల్ స్థానికేతరులకు మాత్రమే ఉండేది. గత ఏడాది నుంచి స్థానికులకు కూడా ఇదే రూల్ అమలు చేస్తున్నారు. వేలం పాటకు పోటీ తీవ్రంగా ఉన్నందునే ఈ నిబంధన తీసుకొచ్చామంటున్నారు నిర్వాహకులు. బాలాపూర్ బొడ్రాయి దగ్గర వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేలం పాట ముగియగానే ట్యాంక్‌బండ్ వైపు శోభాయత్ర మొదలవుతుంది.
ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే