/rtv/media/media_files/2025/11/04/nh163-2025-11-04-08-09-10.jpg)
చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం(Bus Accident) తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొన్నేళ్లలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగినా రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు మొత్తం 69 కిలోమీటర్ల దూరం ఉంది. ఏకంగా 50 ప్రమాదకర మలుపులు ఉన్నాయి. మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్, మొయినాబాద్, చిన్నషాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మీర్జాగూడ, ఆలూరు, అంతారం వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. మలుపుల ఎక్కువగా ఉండటంతో అప్పా-మన్నెగూడ మధ్య ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. వారంలో దాదాపుగా ఐదు వరకు ఇలాంటి రోడ్డు ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ రోడ్డు మార్గం ఇప్పటిది కాదు నిజాం కాలం నాటిది. కర్ణాటకలోని బీజాపూర్‌కు వెళ్లడానికి నవాబులు వేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని కలబురగి, బీజాపూర్‌లతోపాటు వికారాబాద్(vikarabad) జిల్లాకు వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతో కీలకం.. ఇక పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండలకు వెళ్లడానికీ ఇదే మార్గం. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. రైతులు పండించిన పంటలను ఇదే మార్గం నుండి తరలిస్తుంటారు.
Also Read : కలవరపెట్టిన బస్సు ప్రమాదాలు.. తెల్లవారుజామునే...
నితిన్ గడ్కరీ శంకుస్థాపన
ఇన్నాళ్లూ ప్రభుత్వాలు బీటీ వేస్తూ వచ్చాయి తప్ప ట్రాఫిక్ అవసరాల మేరకు విస్తరణ మాత్రం చేపట్టలేదు. 2018లో దీన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి-163(NH 163) గా మార్చింది. రూ.785 కోట్లతో అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లాలోని మన్నెగూడ వరకు 46.40 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించేందుకు 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం 145.42 హెక్టార్ల భూమిని సైతం సేకరించింది. అయితే విస్తరణ పనులకు ఆది నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ మార్గంలో పలువురు ప్రముఖుల స్థలాలు, ఫాంహౌస్‌లు ఉన్నాయి.
మరోవైపు, ఈ మార్గం పక్కన 900కి పైగా మర్రి చెట్లు ఉన్నాయి. అయితే వాటిని నరికివేస్తే పర్యావరణపరమైన ఇబ్బందులు తలెత్తుతాయంటూ సేవ్ బనియన్స్ అనే ఓ సంస్థ ఎన్జీటీని ఆశ్రయించింది. దీనిపై కోర్టు కూడా స్టే విధించింది. మర్రి చెట్లను తొలగించాల్సి వస్తే రీలొకేట్ చేస్తామని, పర్యావరణానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రెండ్రోజుల కిందట ఎన్జీటీ స్టేను ఎత్తివేసింది. పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.
2021 నుంచి ఐదేళ్లలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి రక్తచరిత్ర చూసుకుంటే ఏకంగా 720 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 211 మంది మృతి చెందగా.. 737 మంది క్షతగాత్రులయ్యారు. రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడం, రోడ్డు చిన్నగా ఉండడంతో రోజూ ప్రమాదాలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read : ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం!
Follow Us