/rtv/media/media_files/2026/01/08/fotojet-97-2026-01-08-16-07-29.jpg)
District reorganization
District Reorganization : పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించడంతో జిల్లాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించి అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందని పేర్కొన్న మంత్రి, వాటన్నింటినీ సరిచేస్తామని ప్రకటించడంతో పాత జిల్లాల మార్పు.కొత్త జిల్లాల ఏర్పాటుకు ఉద్యమాలు తెరమీదకు వస్తున్నాయి. అవసరం లేకున్నా చేశారని భావిస్తున్న సిరిసిల్ల, సిద్దిపేట, నారాయణ పేట, ములుగు జిల్లాలతో పాటు మరో 6 జిల్లాలను రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిన్న జిల్లాలను పక్కనున్నపెద్ద జిల్లాలలో విలీనం చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్న ప్రచారం సాగుతోంది.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలుగో జిల్లా..
లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొన్ని జిల్లాలకు పేర్లు మార్చాలనే ప్రతిపాదనలు కూడా చేస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన 33 జిల్లాలను 23కి కుదించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత నాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పదిజిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించింది. అయితే ఆయా జిల్లాల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీని కారణంగా పలు డివిజన్లు, నియోజకవర్గాలు, మండలాల పరిధిలు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం అంటోంది. దీనికోసం తిరిగి జిల్లాల పునర్వ్యస్తీకరణ చేపడుతామని ప్రకటించింది. ఈ విషయం తెరమీదకు రావడానికి ముందే గ్రేటర్ హైదరాబాద్ ను విభజించి మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో జిల్లాల పునర్విభజన ప్రక్రియను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోలీస్ కమిషనరేట్ల పరిధులకు అనుగుణంగా జిల్లాల హద్దులను మార్చడం ద్వారా ప్రజలకు, శాంతిభద్రతల నిర్వహణకు ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.
జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లా
ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లను నాలుగుగా విభజించి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీగా మార్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాల హద్దులను కూడా కమిషనరేట్ల పరిధితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2027 జనగణన ప్రక్రియ ప్రారంభానికి ముందే అంటే వచ్చే ఏడాది జనవరి నాటికే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 16 మండలాలుగా ఉన్న హైదరాబాద్ జిల్లా పరిధిని పూర్తిగా మార్చనున్నారు. అందులో భాగంగా పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలు, అమీర్‌పేట మండలంలోని బేగంపేట ప్రాంతాన్ని మల్కాజిగిరి జిల్లాలో కలిపే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు బండ్లగూడ, బహదూర్‌పుర వరకే ఉన్న జిల్లా హద్దులు, ఇకపై శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల వరకు విస్తరించనుండటంతో ఆ మండలాల్లో జీహెచ్‌ఎంసీ పరిధి ఎంతవరకు ఉంటుందో, అంతవరకే హైదరాబాద్ జిల్లా కిందికి తీసుకురానున్నారు. జైపాల్ రెడ్డి పేరిట ఫ్యూచర్ సిటీ జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఇక మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధికి సమానంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా హద్దులను, రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో విలీనం చేయనున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్బీనగర్, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. అయితే, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం జీహెచ్‌ఎంసీ పరిధికి బయట ఉండటంతో దీనిపై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉంది. మరోవైపు రంగారెడ్డి జిల్లాను రెండుగా విభజించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండే ప్రాంతం 'అర్బన్ జిల్లా'గా మారుతుంది. కొత్తగా ఏర్పడిన 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్ పరిధిని రూరల్ జిల్లాగా మార్చే అవకాశం ఉంది. ఇందులో షాద్‌నగర్, చేవెళ్ల, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, యాచారం, మంచాల, కందుకూరు, మహేశ్వరం వంటి మండలాలు ఉండే అవకాశం ఉంది.
నల్గొండ జిల్లాలోనూ..
కాగా నల్గొండ జిల్లాలోనూ పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని ఒకే జిల్లా పరిధిలోకి రాగా, మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు, మూడు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. తాజాగా, రెవెన్యూ మంత్రి వ్యాఖ్యలతో అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా మార్పులు చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గం నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో విస్తరించగా, మునుగోడు నియోజకవర్గం నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఉంది. నకిరేకల్ నియోజకవర్గంలో రామన్నపేట మండలం యాదాద్రి జిల్లాలోకి వెళ్లగా, మిగిలిన అన్ని మండలాలు నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. ఒకే నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో పాటు, రోడ్ల నిర్మాణాలు, ఇతర పలు సమస్యలపై ఎమ్మెల్యేలు, ప్రజలు రెండు, మూడు జిల్లాల పరిధిలోని కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అందుకే వీటిని పునర్వ్యస్తీకరించాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది.
Also Read : భర్తకు 2 కోట్ల ఇన్సూరెన్స్..లేపేసి గుండెపోటు కథ..లవర్‌తో ఎంజాయ్ చేద్దామనుకుంటే...
హుస్నాబాద్, బెజ్జంకిలో ఉద్యమం
రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో సిద్దిపేట(siddipet) జిల్లా ఏర్పాటు చేసి కరీంనగర్ జిల్లా పరిధిలోని హుస్నాబాద్(husnabad), కోహెడ మండలాలను కలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మూడు జిల్లాల్లో కలిపారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరీంనగర్‌లో కలుపుతామని గతంలో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) హామీ ఇచ్చారు. కరీంనగర్‌లో కలపాలని హుస్నాబాద్, బెజ్జంకిలలో ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. బెజ్జంకి మండలాన్ని సైతం కరీంనగర్‌లో కలపాలని కరీంనగర్ సాధన సమితి పేరుతో బెజ్జంకి ప్రజలు ఉద్యమం చేస్తున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/01/08/fotojet-96-2026-01-08-16-11-48.jpg)
పీవీ హుజురాబాద్ జిల్లా పోరు
తెలంగాణకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరిట హుజూరాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పూర్వపు హుజూరాబాద్ నియోజక వర్గానికి చెందిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, ప్రస్తుత హుజూరాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాలు, కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, వీ.సైదాపూర్, భూపాలపల్లి జిల్లాలలోని మొగుళ్లపల్లి, టేకుమట్లతో కలిపి మొత్తం 13 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు సీనియర్ నాయకులు, స్థానికులు ర్యాలీ చేపట్టారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. మరోవైపు అదిలాబాద్ తో సహా తమ ప్రాంతాలను అశాస్త్రీ యంగా విభజించారని మహబూబ్ నగర్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us