/rtv/media/media_files/2025/06/09/MhEOlATFOFLjhcqY7BOB.jpg)
CM Revanth Reddy to visit Medaram today
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మజాతర(Medaram Sammakka Saralamma Jatara). ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరిగే ఈ జాతర ఏర్పాట్లను తరతరాలు గుర్తుంచుకునేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా చర్యలు చేపట్టారు. దీనికోసం ఆయన ఈ రోజు మేడారంలో క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. సమ్మక్క- సారలమ్మ జాతర ఏర్పాట్లను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) మంగళవారం మేడారం వెళ్లనున్నారు. ఇద్దరు అమ్మవార్ల గద్దెల చుట్టూ చేపట్టబోయే నూతన ఏర్పాట్లుకు సంబంధించిన నమూనా ఆకృతిని ఆయన ఆవిష్కరిస్తారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క(Minister Seethakka), కొండా సురేఖ కూడా ఉంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి సీతక్క రెండు రోజులుగా మేడారంలోనే ఉండి అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలోఒ వెయ్యిమందితో భద్రతాచర్యలు చేపట్టినట్లు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. కాగా సీఎం పర్యటనలో భాగంగా స్వాగత తోరణానికి ఎదురుగా సభ నిర్వహించనున్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో అధికారులతో జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు.
కాగా మేడారం జాతర(Medaram Jatara 2026) కోసం గతంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసేవారు. అయితే మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేయాలని దీనికోసం వంద రోజుల కార్యాచరణను సీఎం నిర్ధేశించారు. ఆ పనులను సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం వెళుతున్నారు. ఈ సందర్భంగా పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో కలిసి ఆయన జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై మేడారంలో సమీక్ష చేయనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని పెద్ద సంఖ్యలో హజరయ్యే భక్తులు ఏకకాలంలో దర్శించుకునేందుకు వీలుగా ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
Also Read : Heavy rain : బంగాళాఖాతంలోఉపరితల ఆవర్తనం...ఎల్లుండి మరోసారి భారీ వర్షం
సమ్మక్క సారలమ్మ కొలువైన మేడారాన్ని వెయ్యేళ్లు నిలబడేలా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. మేడారం అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. వీటితో భక్తులకు అనుకూలంగా, పూజారుల విశ్వాసాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. భక్తితో, విశ్వాసంతోనే గద్దెల ప్రాంగణం చుట్టూ సాలాహారం నిర్మిస్తున్నారు. అమ్మవార్లను దర్శించుకునే క్రమంలో తొక్కిసలాటలు, ఈ క్రమంలో కొంతమంది తప్పిపోవడం సాధారణమైంది. దీన్ని నివారించేందుకు గద్దెల ప్రాంతాన్ని గ్రానైట్‌తో తీర్చిదిద్దనున్నారు. రూ.15 కోట్లతో జంపన్న వాగు నుంచి మేడారం గద్దెల వరకు రహదారిని విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రూ.5కోట్లతో జంపన్నవాగుకు ఇరువైపులా గ్రీనరీతోపాటు వసతులు కల్పించనున్నారు. పర్యాటక ప్రదేశాలైన రామప్ప, లక్నవరం, మేడారం జాతర ప్రత్యేకతలు తెలుపుతూ వాటి కళాత్మకతను పర్యాటకులకు తెలియజేసే విధంగా గట్టమ్మ నుంచి మేడారం వరకు ఉన్న జంక్షన్‌లను అభివృద్ధి చేయనున్నారు. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ఏడు కి.మీ., రోడ్లు, రెండుచోట్ల వంతెనల విస్తరిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో సైడ్ కాలువలను నిర్మిస్తారు. కొత్తూరు సబ్‌స్టేషన్-కన్నెపల్లి వరకు కొత్తగా రోడ్డు నిర్మించనున్నారు. కాల్వపల్లి నుంచి జిల్లా సరిహద్దు వరకు మరో రోడ్డును అభివృద్ధి చేస్తారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, ప్రెస్ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సీఎం పర్యటన ఇలా...
హైదరాబాద్ బేగంపేట నుంచి ఉదయం 10.45 ప్రత్యేక హెలీకాప్టర్‌లో మేడారం పయనం
మధ్యాహ్నం 12.00 గంటలకు మేడారం చేరుకుంటారు.
12.15 నుంచి 1.30 గంటల వరకు పూజారులతో పరిచయం. గద్దెల ప్రాంగణం విస్తరణ పనులపై సమాలోచనలు, మేడారం మాస్టర్ ప్లాన్ డిజిటల్ తెరపై ఆవిష్కరిస్తారు
1.30 నుంచి 2.30 ఉన్నతాధికారులతో సమావేశం.
మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
Also Read : ఆశ్రయం ఇచ్చి ఇరుక్కుకున్నాడు.. పరువుపోతుందనుకుంటే ప్రాణం పోయింది