Telangana Elections: మూడు ప్రధాన పార్టీలకు ఆ ముగ్గురూ అధ్యక్షులే.. ఒకరు ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి అయితే.. మరో ఇద్దరు ప్రతిపక్షంలో కీలక భూమిక పోషిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ముగ్గురిదీ ప్రత్యేక స్థానమే. ప్రత్యేక తెలంగాణ(Telangana) ఏర్పాటు తరువాత మూడవ సారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్(TRS) కాస్తా బీఆర్ఎస్‌గా(BRS) మారింది. అధ్యక్షుడు మాత్రం కేసీఆరే. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు మునుపటి కంటే ఈసారి కాస్త ఎక్కువే పుంజుకున్నాయి. అయితే, గత ఎన్నికల నాటి సారథల స్థానంలో కొత్త అధ్యక్షుడు వచ్చారు. వారి సారథ్యంలోనే తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్నాయి కాంగ్రెస్, బీజేపీలు. మరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఈ ముగ్గురు నేతల్లో ఎవరి బలం ఏంటి? ఎవరి పొలిటికల్ హిస్టరీ ఏంటో సారి చూద్దాం..
కేసీఆర్..
ప్రస్తుత సీఎం, గులాబీ బాస్ కేసీఆర్.. 1983లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి పోటీ చేశారు. అనంతుల మదన్ మోహన్ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుగులేని నేతగా నిలిచారు కేసీఆర్. సిద్దిపేటలోనే 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి వరుసగా జయకేతనం ఎగురవేశారు. టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత..ఆ పార్టీ అభ్యర్థిగా 2001 ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2004లో సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. కరీంనగర్ ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. కేంద్రమంత్రిగానూ పని చేశారు కేసీఆర్. 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి గెలిచి ఎంపీగా హ్యాట్రిక్ సాధించారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి రెండు సార్లు గెలిచి.. సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గజ్వేల్ నుంచి బరిలో దిగుతున్నారు సీఎం కేసీఆర్. అయితే, ఈసారి గజ్వేల్‌తో పాటు.. కామారెడ్డి నుంచి కూడా ఆయన పోటీ చేయడం విశేషం.
కిషన్ రెడ్డి..
కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో ప్రస్థానం ప్రారంభించిన కిషన్‌రెడ్డి అనేక పదవులను అందుకున్నారు. ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, కేంద్రమంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో కార్వాన్ నుంచి పోటీ చేసి మజ్లిస్ అభ్యర్థి సయ్యద్ సజ్జర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత హిమాయత్ నగర్, అంబర్‌పేట్ స్థానాల నుంచి వరుసగా విజయాలు సాధించారు కిషన్‌రెడ్డి. 2018లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. అనంతరం కేంద్రమంత్రిగా చోటు దక్కించుకున్నారాయ. ఇటీవలే బీజేపీ తెలంగాణ సారథిగా కూడా బాధ్యతలు స్వీకరించారు కిషన్ రెడ్డి. ఆయన సారథ్యంలోనే బీజేపీ తెలంగాణ ఎన్నికల రణరంగంలో దూసుకుపోతోంది. ఈసారి తెలంగాణలో హంగ్ వస్తుందని, అధికారం తామే చేపడతామని ధీమాతో ఉన్నారు బీజేపీ నేతలు.
రేవంత్ రెడ్డి..
టీపీసీసీ సారథి నియామకమైన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ చూసుకున్నట్లయితే.. గ్రాడ్యూయేషన్ సమయం నుంచే రాజకీయాలపై ఆసక్తి కనబరిచారు. గ్రాడ్యూయేషన్ చదవుతున్న సమయంలో రేవంత్ రెడ్డి అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉన్నారు. తొలుత టీడీపీలో జాయిన్ అయిన ఆయన.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో 2001-02 మధ్యలో టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్)లో పని చేశారు. 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీగా విజయం సాధించారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ టీడీపీ తరఫున పోటీ చేసిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ తరువాత 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్‌రెడ్డి 2014–17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. 2017 అక్టోబర్‌లో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. అయితే, ఆ ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసిన రేవంత్.. పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అటు తరువాత కొడంగల్ నుంచి మల్కాజిగిరికి షిఫ్ట్ అయిన రేవంత్.. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి.. 2021లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారాయన. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కొడంగల్, కామారెడ్డి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో నిలుస్తున్నారు రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు ప్రత్యర్థిగా పోటీ చేస్తుండగా.. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.
Also Read:
ఆమె వయసు 17 ఏళ్లే.. చేసే పని చూసి పోలీసులే షాక్..
పులి డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఎమ్మెల్యే.. వీడియో చూస్తే పూనకాలే..