Telangana BJP Master Plan: ఉత్తరాదిలో బలమైన పార్టీకి ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో మాత్రం అనామక పార్టీగా మిగిలిపోయింది. నిన్నటి వరకు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కూడా చేజారిపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దక్షిణాది రాష్ట్రాల్లో పాగ వేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా బలమైన క్యాడర్ ఉన్న తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర నేతలో వరుస భేటీలు నిర్వహిస్తోంది. అలాగే అగ్రకులాల పార్టీ అనే ముద్రను తొలగించే దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్న 31 రిజర్వుడు స్థానాలపై గురి పెట్టింది. 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజవర్గాలకు చెందిన నేతలతో కిషన్ రెడ్డి (Kishan Reddy), సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ప్రకాశ్ జవదేవకర్. ఈటల రాజేందర్ (Etela Rajender) భేటీ అయి దిశానిర్దేశం చేశారు. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు.
మరోవైపు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ మార్పులు, చేరికలతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. పార్టీ పటిష్టత, కేసీఆర్ (KCR) ప్రభుత్వ వైఫల్యాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. మొన్నటి దాకా బీఆర్ఎస్‌కు (BRS) ప్రత్యామ్నాయం బీజేపీయేనని ప్రజలు కూడా బలంగా నమ్మారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబంపై బండి సంజయ్‌తో పాటు ఇతర నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ క్యాడర్‌లో జోష్ నింపారు.
అలాగే గ్రేటర్ ఎన్నికలతో పాటు ఉపఎన్నికల్లోనూ సత్తా చాటి అధికారంలోకి రాబోయేది తమనేని బలంగా చెప్పారు. ఈ క్రమంలో ఎంతో మంది సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా పార్టీ స్తబ్దుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు నేతలతో పాటు కార్యకర్తలకు షాక్ ఇచ్చింది. అధ్యక్షుడి మార్పు తర్వాత సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టేలా అనుకున్న స్థాయిలో ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో పార్టీ బలోపేతంపై కేంద్ర పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి కేసీఆర్‌ను ఢీకొట్టేది కాంగ్రెస్ కాదు.. బీజేపీయేననే నమ్మకం ఎంతవరకు ప్రజల్లోకి తీసుకువెళ్తారో వేచి చూడాలి.
Also Read: బీజేవైఎం కార్యకర్తల ఆందోళన..నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్