GST on bikes: బైక్ కొనాలనుకునే వారికి ఓ గుడ్‌న్యూస్, మరో బ్యాడ్ న్యూస్

భారతదేశంలో బైక్ వాహనాల కొనుగోలుదారులకు GST కౌన్సిల్ శుభవార్త, చెడు వార్త రెండింటినీ చెప్పబోతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ విధానం ప్రకారం, 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లు, స్కూటర్ల ధరలు తగ్గనున్నాయి.

New Update
GST on Big bikes

GST on Big bikes

భారతదేశంలో బైక్ వాహనాల కొనుగోలుదారులకు GST కౌన్సిల్ శుభవార్త, చెడు వార్త రెండింటినీ చెప్పబోతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జీఎస్టీ విధానం ప్రకారం, 350సీసీ కంటే తక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లు, స్కూటర్ల ధరలు తగ్గనున్నాయి. అయితే, 350సీసీ పైబడిన భారీ సామర్థ్యం గల బైక్‌లను కొనుగోలు చేసేవారు మాత్రం అధిక పన్ను భారం మోయక తప్పదు.

చిన్న బైకులకు భారీ ఊరట
ప్రస్తుతం 350సీసీ లోపు ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లు, స్కూటర్లపై 28 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీనిని 18 శాతానికి తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మార్పు అమల్లోకి వస్తే, తక్కువ స్థాయి సామర్థ్యం గల టూ-వీలర్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. భారతదేశంలో అమ్ముడయ్యే టూ-వీలర్లలో 97 శాతం ఇవే ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి, సామాన్య ప్రజలకు తక్కువ ధరలో వాహనాలు అందుబాటులోకి వస్తాయి. ఇది దేశీయ మార్కెట్‌లో అమ్మకాలను పెంచుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

పెద్ద బైకులకు అధిక పన్ను
మరోవైపు, 350సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌లపై ప్రస్తుతం 28 శాతం GSTతో పాటు 3 శాతం అదనపు సెస్సు ఉంది. దీంతో మొత్తం పన్ను 31 శాతంగా ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, వీటిపై GSTని ఏకంగా 40 శాతానికి పెంచే అవకాశం ఉంది. ఈ భారీ పెంపుతో రాయల్ ఎన్‌ఫీల్డ్, కేటీఎం, హార్లే-డేవిడ్‌సన్, ట్రయంఫ్ వంటి పెద్ద బైకుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల కొన్ని ప్రీమియం మోడళ్లపై లక్షల రూపాయల మేర ధరలు పెరిగే అవకాశం ఉంది.

జిఎస్టీ మార్పుకు కారణం
ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థను సరళీకృతం చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ స్లాబులను (5%, 12%, 18%, 28%) రెండు ప్రధాన స్లాబులుగా (5% మరియు 18%) మార్చాలని యోచిస్తోంది. 5 శాతం అత్యవసర వస్తువులకు, 18 శాతం సాధారణ వస్తువులకు వర్తిస్తుంది. అదే సమయంలో, లగ్జరీ, విలాసవంతమైన వస్తువులపై 40 శాతం ప్రత్యేక రేటు విధించాలని ప్రతిపాదించింది. 350సీసీ పైబడిన బైకులను ఈ లగ్జరీ కేటగిరీ కిందకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలపై త్వరలో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త మార్పులు అమల్లోకి వస్తే, బైకుల మార్కెట్‌లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయి.

Advertisment
తాజా కథనాలు