Welcome Visit Revanth : తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి (Revanth Reddy)నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియం (LB Stadium)లో ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు నగరానికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్ళి వారిని స్వాగతించారు. రేవంత్ తో పాటూ థాక్రే, శ్రీధర్ బాబు ఉన్నారు. ఇక 11 గంటలకు హోటల్ ఎల్లా నుంచి కాంగ్రెస్ నేతలు అందరూ ఎల్బీ స్టేడియానికి తరలి వెళ్ళనున్నారు. బస్సుల్లో వీళ్ళు అక్కడకు చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా..భట్టి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఉత్తమ్ కుమార్, కోమటి రెడ్డికి మంత్రి పదవులు ఇవ్వనున్నారు.
అలాగేఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన నేతలు హాజరవుతున్నారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది.మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలకు థాక్రే ఫోన్ చేశారు. దామోదర, శ్రీధర్ బాబు, పొంగులేటికి ఫోన్ చేశారు. ఇక భట్టి, ఉత్తమ్, పొంగులేటిలను మంత్రిగా ప్రమాణం చేయాలని ఆహ్వనించారు.
Also Read:తెలంగాణ సీఏంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. హాజరవనున్న ప్రముఖులు..
ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మూడు వేదికల ఏర్పాటు చేయగా.. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఎడమవైపున63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక, కుడిపక్కన వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్‌కి స్వాగతం పలుకుతారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఉన్నాయి. 30 వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా కుర్చీలను వేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటుచేశారు.