సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాలు చెల్లించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కాంట్రాక్టు లెక్చరర్ల పాత్ర కీలకంగా మారిందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవని, ప్రతీ ఒక్కరినీ ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇంతవరకు వారి ఉద్యోగాలకు భరోసా ఇవ్వలేకపోయారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాంట్రాక్ట్ ఉద్యోగుల కష్టాలు మాత్రం తీరలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారిని క్రమబద్దీకరణ చేయకపోగా.. జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని రేవంత్ రెడ్డి కోరారు.
రాష్ట్రంలో మరో ఉద్యమం చేపట్టబోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేసి వారికి జీతాలు పెంచకపోతే ఉద్యోగులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్ తన బినామీలకు వేల కొట్లు అప్పగిస్తున్నారన్న రేవంత్.. ఉద్యోగులకు మాత్రం జీతాలు వేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. జీతాలు సమయానికి రాకపోవడంతో ఉద్యోగుల ఇళ్లు గడవడం ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్ తనకు మాత్రమే కుటుంబం ఉందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం ఉద్యోగుల కుటుంబాలను సైతం చూడాలని రేవంత్ రెడ్డి వివరించారు.
అవినీతి ప్రభుత్వంలో ప్రజలు సైతం నలిగిపోతున్నారని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి ఎన్నికల అనంతరం మరోమాట చెప్పడం కేసీఆర్‌కు అలవాటైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులను మాట్లాడకుండా చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హాయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చినట్లు తెలిపిన రేవంత్.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు.