ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ తో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు మారే రోజులు ఎంతో దూరంలో లేవని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. లోక్ సభలో ఢిల్లీ ఆర్టినెన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
బిల్లు గురించి మాట్లాడుతూ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఆర్టినెన్స్ బిల్లు రాజ్యాంగ విరుద్దంగా వుందన్నారు. అందుకే ఆ బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించేందుకు గతంలో అటల్ బిహారీ వాజ్ పాయ్ బిల్లును కూడా ప్రవేశ పెట్టారని చెప్పారు. ఈ బిల్లు ద్వారా గౌరవసభ హోదాను కేంద్రం కించ పరుస్తోందన్నారు. బీజేపీ, ఆప్ లు తమ రాజకీయ పోరాటాన్ని సభ వెలుపల చూసుకుంటే బాగుంటుందని కేంద్రానికి ఓవైసీ సూచించారు.
గతంలో జమ్ము కశ్మీర్ పునర్విభజన సందర్బంగా కూడా ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, చెన్నై, ముంబైలను కేంద్రం యూటీలుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ఓవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లేదా మరే ఇతర నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కేంద్రం అనుకోవడం లేదన్నారు.
ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. గతంలో తెలంగాణ ఉద్యమం పీక్స్ లో వున్నప్పుడు కూడా ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు. గతంలో ఏపీ పునర్విభజన సమయంలోనూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఓవైసీ తప్పుబట్టారని అన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీపై ఓవైసీ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు.