Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికలు.. కేజ్రీవాల్‌కు అగ్ని పరీక్ష!

ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరాటంలో ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.. బీజేపీపై గెలుస్తాడా ? లేదా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డా.పెంటపాటి పుల్లారావు అందించిన విశ్లేషణ ఈ ఆర్టికల్ లో చదవండి.

New Update
Pentapati Pulla Rao Opinion on Delhi Elections

Pentapati Pulla Rao Opinion on Delhi Elections

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరాటంలో ఆప్ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.. బీజేపీపై గెలుస్తాడా ? లేదా ? అనేదానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌ కూడా పోటీలో ఉన్నప్పటికీ.. ఈ పార్టీ కేజ్రీవాల్‌కు ఆటంకం కలిగించడమే కాకుండా మైనార్టీ ఓట్లను కూడా రాబట్టుకోనుంది. 2013లో ఢిల్లీలో, అలాగే 2022లో పంజాబ్‌లో కేజ్రీవాల్‌ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ ఆగ్రహం ఏంటో అర్థం చేసుకోవచ్చు. 

1983లో ఎన్టీఆర్‌ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సీఎం అయినట్లు.. కేజ్రీవాల్‌ కూడా 2013లో ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు. కేజ్రీవాల్‌కు రాజకీయ నేపథ్యం గాని, ఎన్టీఆర్‌ లాగా 40 ఏళ్ల సినిమా అనుభవం కూడా లేదు. 2015, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ క్లీన్‌స్వీప్ చేశారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ.. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచింది. కానీ 2014, 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. 

జాతీయ నేతగా కేజ్రీవాల్

కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ అనేక రాష్ట్రాల్లో పోటీ చేసింది. ఆయన ప్రతీచోట కూడా పాపులారిటీని సంపాదించుకున్నారు. పంజాబ్‌, ఢిల్లీలో గెలిచారు. దేశంలో రెండు రాష్ట్రాల్లో గెలిచిన ఒకేఒక్క ప్రాంతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయే.  ఇప్పటికే ఆప్‌కు జాతీయ పార్టీగా గుర్తింపు కూడా వచ్చింది. 2024 వరకు చూసుకుంటే కేజ్రీవాల్‌ బీజేపీలో గాని, కాంగ్రెస్‌ ఫ్రంట్‌లో గాని చేరలేదు. కానీ బీజేపీ ఆయనపై అవినీతి కేసులు పెట్టి చివరికి జైలుకి పంపించింది. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల కోసం కేజ్రీవాల్‌ ఇండియా కూటమితో  జతకట్టారు. కానీ ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కూటమి నుంచి విడిపోయిన ఆప్ ఒంటిరిగానే పోటీ చేయనుంది.   

కేజ్రీవాల్ గెలవాల్సిందే 

కేజ్రీవాల్ ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే.. ఆయనకు ఎలాంటి అధికారం ఉండదు. దీంతో బీజేపీ ఆయనపై ఉన్న అవినీతి కేసులపై మరిన్ని చర్యలు తీసుకునేందుకు యత్నిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా సంతోషంగానే ఉంటుంది. కేజ్రీవాల్‌ వ్యవహార తీరు వల్ల కాంగ్రెస్‌కు ఆయనంటే ఎలాంటి జాలి లేదు. ఒకవేళ కేజ్రీవాల్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే.. ప్రజలు తనపై పెట్టిన అక్రమ కేసులను ఖండించారని, తన నిజాయతీ వల్లే గెలిపించారని చెబుతారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్‌ విఫలమవుతున్నందున విపక్ష జాతీయ నాయకత్వానికి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుంటారు. ఇతర విపక్ష పార్టీలు కూడా కేజ్రీవాల్‌కు జాతీయ నాయకత్వం అప్పగించేందుకు మద్దతిస్తాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఓడిపోవాలని కోరుకుంటుంది.  

కేజ్రీవాల్‌ విజయానికి అవకాశాలు

కేజ్రీవాల్‌కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. 2014 నుంచి బీజేపీ ఢిల్లీలో అన్ని లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసరికి ప్రభావం చూపించలేకపోతోంది. బీజేపీ వరుసగా 6 సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. ఈ పార్టీకి ఢిల్లీలో బలమైన నేత ఎవరూ కూడా లేరు. కానీ ప్రధాని మోదీ మాత్రం బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అక్కడి ప్రజలను కోరుతున్నారు. కేజ్రీవాల్‌.. తనకంటూ ఓ విశ్వాసమైన ఓటు బ్యాంక్‌ను సృష్టించుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా వాళ్లు ఓటు వేస్తే ఆయనకు తిరుగుండదు.    

మరోవైపు మోదీ.. బీజేపీ గెలిస్తే ఆప్ ప్రకటించిన హామీలన్నీ అమలు చేస్తామని, ఇంకా అంతకన్నా ఎక్కువగానే చేస్తామని చెబుతున్నారు. అయితే కేజ్రీవాల్ పాలనపై ఓటర్లు అసంతృప్తితో ఉన్నారా ? లేదా ? అనేదే ప్రశ్న. ఆప్ నుంచి పోటీ చేసే అభ్యర్థులందరూ కూడా మధ్యతరగతి, అంతకన్నా తక్కువ కుటుంబ నేపథ్యం ఉన్నవారే. ఇదే కేజ్రీవాల్‌కు పెద్ద బలం. అంతేకాదు  సీనియర్ సిటిజెన్లకు ఉచిత వైద్యం, 18 ఏళ్లు దాటిన ప్రతీ మహిళకు రూ.2100 ఆర్థిక సాయం వంటి పథకాలు అందిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అలాగే హిందూ, సిక్కు పూజారులకు గౌరవ వేతనంగా నెలకు రూ.18 వేలు ఇస్తామని ప్రకటించారు. నార్త్ ఇండియాలో ఇలాంటి పథకాలు ఎప్పుడూ రాలేవు. ఇవి కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో తప్పకుండా సహాయపడతాయి. 

ఢిల్లీ ఎన్నికల గురించి మరో ఆసక్తికరమైన విషయమేంటంటే మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ మూడు కూడా ఒకదానికొకటి ద్వేషించుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ.. మోదీ కన్నా కేజ్రీవాల్‌పైనే ఎక్కువ ద్వేషం పెంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్, ఆప్ మధ్య నెలకొన్న వైరుధ్యం.. తమకు దోహదపడుతుందని బీజేపీ భావిస్తోంది. కానీ కేజ్రీవాల్‌ను మాత్రం తక్కువ అంచనా వేయకూడదు.  

డా.పెంటపాటి పుల్లారావు
పొలిటికల్ ఎనలిస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు