/rtv/media/media_files/2025/08/25/wife-and-sons-tied-up-and-beat-up-a-retired-dsp-2025-08-25-16-02-17.jpg)
Wife and sons tied up and beat up a retired DSP
Crime News : డబ్బుకు లోకం దాసోహం అన్నారు. డబ్బుల కోసం రక్త సంబంధాలను సైతం వదులుకోవడానికి లేదా వదిలించుకోవడానికి ఎవరు వెనుకాడటం లేదు. భార్య, కొడుకులు, అన్నదమ్ములు అందరూ అనుబంధాలకు పాతరవేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. రిటైర్ అయిన ఓ డీఎస్పీని డబ్బుల కోసం భార్యపిల్లలు తాళ్లతో కట్టేసి హింసించిన ఘటన వైరల్‌గా మారింది. అతని ఛాతీపై కూర్చుని ఒకరు బాదుతుంటే.. మరొకరు కాళ్లు కదలకుండా పట్టుకోగా.. భార్య కూడా కొడుకులకు వంతపాడింది.62 ఏండ్ల వయసున్న ప్రతిపాల్ సింగ్‌ను వారు తాళ్లతో కట్టి నేలపై ఈడ్చుకెళ్లారు. అతని భార్య పిల్లలే ఇంతటి దారుణానికి పాల్పడటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపాల్ సింగ్‌పై దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆ కుటుంబ సభ్యులు స్థానికులతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రతిపాల్ సింగ్ యాదవ్ ఈ ఏడాది మార్చి 31న పదవీ విరమణ చేశాడు. దానికి ముందు షియోపూర్ జిల్లాలోని మహిళా సెల్‌లో పనిచేశారు. ఆ అధికారిపై అతని భార్య పిల్లలు దాడికి పాల్పడటం కలకలం రేపింది. తండ్రిని తాళ్లతో కట్టేసి కొడుకులు ఈడ్చుకుంటూ వెళ్లడమే కాకుండా ఛాతీపై కూర్చుని చితకబాదడం అక్కడి వారందరినీ కలచి వేసింది. ఈ సంఘటన ఆగస్టు 20న జరిగినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో, ఇద్దరు కొడుకుల్లో ఒకరు ఛాతీపై కూర్చుని ఉండగా, మరొకరు అతని కాళ్ళను తాళ్లతో బంధించి పట్టుకుని ఉండటం కనిపిస్తోంది. అతని భార్య కూడా అక్కడే ఉండి కొడుకులకే మద్ధతుగా నిలిచినట్లు కనిపిస్తోంది. ఇదంతా చూసిన చుట్టుపక్కల వారు అతని వదిలేయాలని కోరినప్పటికీ వారు వినకపోవడం గమనార్హం.
రిటైర్డ్ డీఎస్పీ ప్రతిపాల్ గత15 ఏళ్లుగా భార్యపిల్లలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. మార్చి నెలలో రిటైరైన ఆయన తమకు డబ్బులు ఇవ్వడం లేదనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి చేసిన కొడుకులు డీఎస్పీ ఏటీఎం కార్డు, ఫోన్ లాక్కుని.. బలవంతంగా వారి వెంట తీసుకుపోయే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు జోక్యం చేసుకుని కాపాడారు. రిటైర్‌మెంట్ తర్వాత ఆయనకు రూ.20లక్షలు అదినట్లు తెలిసింది. ఆయనకు వచ్చిన డబ్బు తమకు ఇవ్వాలని భార్య, ఇద్దరు కొడుకులు ఆయన దగ్గరికి వచ్చి పట్టుబట్టినట్లు తెలిసింది. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తాళ్లతో కట్టేసి ఫోన్, ఏటీఎం కార్డు లాక్కుని అక్కడ్నుంచి వెళ్లిపోయారని స్థానికులు తెలిపారు. వారి కుమార్తె గోరఖ్‌పూర్‌లో ఎంబీబీఎస్ చదువుతోందని స్థానికులు వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత తన EPF నుండి రూ20 లక్షలు అందుకున్నానని, గ్రాట్యుటీ, ఇతర నిధుల నుండి దాదాపు రూ.33 లక్షలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ప్రతిపాల్ తెలిపాడు. తన పెద్ద కొడుకుకు రూ.5 లక్షలు, చిన్న కొడుకుకు రూ.15 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చానని, అయితే తన కుమార్తె వివాహానికి కూడా డబ్బులు అవసరం ఉండటంతో మిగిలిన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో వారు దాడి చేసినట్లు ఆయన తెలిపారు. కానీ, జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రతిపాల్ నిరాకరించారు. కానీ, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చూడండి:Crime News : ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ