/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-16-52-05.jpg)
Who Will Lead NCP After Ajit Pawar's Tragic Death?
మహారాష్ట్ర రాజకీయాల్లో విషాదం నెలకొంది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించడం అందరినీ షాక్‌కి గురిచేసింది. బుధవారం ఉదయం అజిత్ పవార్ ముంబై నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి ప్రైవేట్ విమానంలో వెళ్తున్నారు. ఫిబ్రవరి 5న జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు విమానం ప్రయత్నిస్తున్న క్రమంలో రన్‌వే సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఈ ప్రమాదంలో అజిత్ పవార్, సెక్యూరిటీ ఆఫీసర్ విదిప్ జాదవ్‌తో పాటు మరో ముగ్గురు పైలట్లు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అజిత్ పవార్ అకస్మిక మృతితో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. 2023లో ఎన్సీపీ చీలిపోయిన సంగతి తెలిసిందే. అంతర్గత విభేదాల కారణంగా ఆ పార్టీ ఫౌండర్ శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్.. తనతో పాటు 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి బయటికి వచ్చారు. దీంతో ఎన్సీపీ.. శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గంగా విడిపోయింది. చీలిక తర్వాత 'అసలైన పార్టీ ఎవరిది?' అనే వివాదం కొనసాగింది. చివరికి 2024 ఫిబ్రవరి 6న కేంద్ర ఎన్నికల కమిషన్ దీనిపై తీర్పునిచ్చింది.
Also Read: అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్.. పైలట్ శాంభవి పాఠక్ గురించి సంచలన విషయాలు!
మెజారిటీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న అజిత్ పవార్ వర్గాన్నే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా గుర్తించింది. ఇక 2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం.. బీజేపీ, శివసేన (షిండే) వర్గంతో కలిసి మహాయుతి కూటమి నుంచి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమే గెలిచింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు బాధ్యతలు స్వీకరించారు. అజిత్ పవార్ మృతితో ఎన్సీపీని ఎవరు ముందుకు నడిపిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. రెండు వర్గాలుగా చీలిపోయిన ఈ పార్టీ మళ్లీ కలిసే ఛాన్స్ ఉందా ? లేదా ? అనేది చర్చనీయాంశమవుతోంది.
సుప్రీయా సులే
సుప్రీయా సులే ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ కూతురు. ఈమెకు ముఖ్యంగా మహిళలు, యువత నుంచి సపోర్ట్ ఉంది. 'రాష్ట్రవాది యువతి కాంగ్రెస్' ద్వారా సుప్రీయా గ్రామీణ ప్రాంతాల్లో బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈమె శరద్ పవార్ వర్గంలోనే కొనసాగుతున్నారు. తండ్రి తర్వాత పార్టీని నడిపించేది ఈమెనే అని నమ్ముతున్నారు. ఒకవేళ గత అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ వర్గం నుంచి గెలిచిన 41 మంది ఎమ్మెల్యేలను సుప్రియా తనవైపు తిప్పుకుంటే ఎన్సీపీ అధినేతగా ఆమెకే బాధ్యతలు వస్తాయి.
Also Read: ట్రంప్‌కు అగ్ని పరీక్ష.. అమెరికాలో మళ్లీ ఎన్నికలు
శరద్ పవార్
ఎన్సీపీ ఫౌండర్ శరద్ పవార్‌కు ప్రస్తుతం 85 ఏళ్లు. ఈ వయస్సులో ఆయన మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లి పార్టీని నిర్మించడం పెద్ద సవాలే. అయితే అజిత్ పవార్ మరణంతో గందరగోళంలో ఉన్న కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సహజంగానే మళ్లీ శరద్ పవార్ వైపు చూసే అవకాశం ఉంటుంది. తన కూతురు సుప్రియా సూలేను లేదా మనవడు రోహిత్ పవార్‌ను ముందుంచి.. శరద్ పవార్ 'కింగ్‌మేకర్'గా చక్రం తిప్పొచ్చు.
సునీల్ ఠాక్రే
అజిత్ పవార్ వర్గంలో బలమైన నేతలుగా సునీల్ ఠాక్రే, ప్రఫుల్ పటేల్ ఉన్నారు. సునీల్‌కు పార్టీని నిర్వహించే సామర్థ్యం ఉంది. ఇక పటేల్‌కు ఢిల్లీ నేతలతో దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. అజిత్ పవార్ తర్వాత వీళ్లిద్దరూ తర్వాతి వరుసలో ఉన్నారు.
అజిత్ పవార్ కొడుకులకి అవకాశం
అజిత్ పవార్ కొడుకులైన పార్థ్ పవార్, జయ్ పవార్‌లు కూడా తండ్రి వర్గం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కానీ వీళ్లకు రాజకీయ అనుభవం అంతగా లేదు. భవిష్యత్తులో వీళ్లు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటే పరిస్థితులు మారవచ్చు.
మహాయుతికి సవాలు
ప్రస్తుతం అజిత్ పవార్ వర్గం మహాయుతి కూటమిలో ఉంది. ఒకవేళ భవిష్యత్తులో అజిత్ పవార్ వర్గాన్ని శరద్ పవార్ మళ్లీ విలీనం చేసుకుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆయన కచ్చితంగా బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేస్తారు. అంతేకాదు అజిత్ పవార్ వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు శరద్ పవార్ వర్గం వైపు స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు. ఇది జరిగితే అధికార కూటమి సవాళ్లను ఎదుర్కోక తప్పదు.
Follow Us