/rtv/media/media_files/2025/07/23/human-trafficking-2025-07-23-13-19-07.jpg)
Human Trafficking
Human Trafficking : పశ్చిమబెంగాల్ నుంచి బిహార్ తరలిస్తున్న అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఉద్యోగాల పేరుతో వీరిని నమ్మించి మోసం చేసినట్లు తేలడంతో యువతులతో పాటు వారిని తరలిస్తున్న ముఠా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం
పశ్చిమ బెంగాల్ నుంచి ఓ రైలు బిహార్ బయల్దేరింది. అయితే ఆ రైలులో పెద్ద సంఖ్యలో యువతులు కలిసికట్టుగా ఓకే బోగిలో ఎక్కారు. అలా అంతా కలిసి వెళ్లడం సాధారణమే అయినప్పటికీ.. వారి వద్దా ఎలాంటి పత్రాలు లేకపోవడం, అందరూ ఆందోళనలో ఉండటంతో రైల్వే సిబ్బందికి సందేహం వచ్చింది. అంతేకాక, వారందరి చేతులపై స్టాంప్‌లు ఉండటం మరింత అనుమానాలకు తావిచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు వారి గురించి ఆరాతీయడంతో అసలు విషయం వెలుగుచూసింది.వారిని అక్రమ రవాణాలో భాగంగానే బిహార్ తరలిస్తున్నట్లు తేలింది.
సోమవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లో 56 మంది యువతులు న్యూ జల్పాయ్‌గురి-పట్నా క్యాపిటల్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. అంతా ఒకే బోగీలో ఎక్కారు. వీరితో పాటు ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆర్‌పీఎఫ్ సిబ్బంది వీరున్న బోగీ వద్దకు వచ్చారు. యువతులంతా ఇలా ఒకేసారి ప్రయాణించడం, వారి ముఖాల్లో ఆందోళన గమనించిన రైల్వే సిబ్బందికి అనుమానం కలిగింది. వెంటనే వారిని టికెట్లు చూపించమని అడిగారు. కానీ, టికెట్లు గానీ, ఇతర ఎలాంటి ఆధారాలు కానీ, వారి వద్దలేవు.
కానీ, వారి చేతులపై కోచ్, బెర్త్ నంబర్లు ముద్రించి ఉన్నాయి. దీంతో వారి వెంట ఉన్న వారిని ప్రశ్నించారు. సరైన సమాధానం రాలేదు. అయితే అందులోని కొంతమంది యువతులు మాత్రం బెంగళూరుకు చెందిన కంపెనీలో ఉద్యోగం కోసం తమను రైల్లో తీసుకెళ్తున్నారని చెప్పారు. బెంగళూరులో ఉద్యోగమైతే బిహార్ ఎందుకు తీసుకెళ్తున్నారని వారితో ఉన్న వ్యక్తులను సిబ్బంది ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రైల్వే సిబ్బంది వారిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. మహిళల అక్రమరవాణాలో భాగంగానే వీరిని బిహార్ తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఆ యువతులందరినీ రక్షించిన అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువతులు అందరూ 18-31 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. కాగా, రవాణా వెనుక ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Also Read : మళ్లీ పరువు తీసుకున్న పాకిస్తాన్.. సొంత దేశంలోనే కూలిన క్షిపణి.. దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు
Also Read : తెలంగాణలో ద్రోణి ప్రభావం...మరో రెండు రోజులు దంచుడే..దంచుడు