/rtv/media/media_files/2025/08/21/vice-presidential-election-2025-2025-08-21-16-19-15.jpg)
Vice Presidential Election 2025
Vice Presidential Election 2025 : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అధికార ప్రతిపక్షాలు ఇద్దరు అభ్యర్థులను బరిలో దింపాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని బరిలో దింపింది. రెండు కూటమిల బలబలాలు ఎలా ఉన్నా ఈ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయి. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి విజయం ఖాయమని లెక్కలు చెబుతున్నా.. అయితే రాజకీయ, వ్యూహాత్మక ప్రాధాన్యం దృష్ట్యా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇండియా కూటమికి అవసరమైన మెజారిటీ లేకపోయినా అభ్యర్థిని పోటీలో నిలబెట్టడంపై పెద్ద వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఏకగ్రీవ ఎన్నికతో నైతిక విజయాన్ని ఇవ్వకూడదన్న వ్యూహంలో భాగంగానే ఇండియా కూటమి తన అభ్యర్థిని పోటీకి దింపిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదే సమయంలో విపక్ష కూటమి ఏకతాటిపై ఉందనే సందేశం ఇవ్వడం కూడా అందులో భాగమేనని తెలుస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ వంటి సంస్థలను వ్యతిరేకించే జేడీయూ, టీడీపీ వంటి లౌకికవాద పార్టీలు అదే నేపథ్యం ఉన్న వ్యక్తికి మద్ధతు ఇవ్వడాన్ని భవిష్యత్తులో ఇరకాటంలో పెట్టడానికి కూడా ఈ ఎన్నిక వారికి ఉపకరించనుంది. రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇద్దరూ దక్షిణ భారతదేశానికి చెందినవారే కావడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థుల వ్యక్తిగత విషయాలతో పాటు వారి బలబలాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ :
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి (సీపీ) రాధాకృష్ణన్. ఆయన 20 అక్టోబర్ 1957న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. చిన్నతనంలోనే ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. తొలిసారి1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండుసార్లు (1998, 1999) కోయంబత్తూరు నుంచి లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆయన టెక్స్‌టైల్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్, పీఎస్‌యూలు, ఫైనాన్స్ కమిటీల్లో సభ్యుడిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా (2004–2007) కూడా పని చేశారు. కాయిర్ బోర్డు ఛైర్మన్ (2016–2020) ఉన్నారు. అనంతరం ఆయన బీజేపీ కేరళ రాష్ర్ట ఇన్‌చార్జ్ (2020–2022) కూడా పనిచేశారు. రాధాకృష్ణన్ 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.జూలై 2024 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ర్టపతి పదవికి పోటీ చేస్తున్నారు.
ఇండియా కూటమి అభ్యర్థి : జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి :
ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిది తెలంగాణ. సుదర్శన్ రెడ్డి1946 జూలై 8న రంగారెడ్డి జిల్లా ఆకులమైలారంలో జన్మించారు. న్యాయవాద విద్యను అభ్యసించిన ఆయన 1971 డిసెంబర్ 27న తొలిసారి హైదరాబాద్‌లో అడ్వొకేట్‌గా తన ప్రాక్టీస్ మొదలు పెట్టారు... దాని కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో తన పేరు నమోదు చేయించుకున్నారు. రిట్ పిటిషన్లు, సివిల్ విషయాల్లో సుదర్శన్ రెడ్డి ప్రాక్టీస్ చేశారు. 1988-1990 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లీడర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఉస్మానియా యూనివర్సిటీకి లీగల్ అడ్వైజర్‌గా, స్టాండింగ్ కౌన్సెల్‌గా కూడా పనిచేశారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియామితులయ్యారు. 2005 డిసెంబర్‌లో గువాహాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. 2007 జనవరి 12న తొలిసారి సుప్రీం కోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన ఆయన 2011 జూలై 8న పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ అనంతరం 2013లో గోవా మెట్టమొదటి లోకాయుక్తగా నియమితులయ్యారు. అయితే ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ఎక్కువకాలం పనిచేయలేదు. కేవలం ఏడు నెలల్లోనే తన పదవీకి రాజీనామా చేశారు.
కూటముల బలబలాలు :
రెండు కూటములు తమ అభ్యర్థుల గెలుపుకోసం మద్దతు కూటగడుతున్నాయి. పార్లమెంట్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కలిపి 781 మంది ఓటర్లు ఉన్నారు. మెజార్టీకి 391 ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 425 ఓట్ల ఉండగా.. వైసీపీకి ఉన్న ఏడుగురు ఎంపీల మద్దతు ఎన్డీయేకేనని ప్రకటించడంతో ఎన్డీయే బలం 432కు చేరింది. ఇక ఇండియా కూటమికి 311 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కన ఎన్డీఏ కూటమికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎన్డీఏ కూటమిలోని కొంత మంది ఇండియా అభ్యర్థికి ఓటు వేస్తే.. అప్పుడు పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. అదే సమయంలోఅయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందిన వాడు కావడంతో టీడీపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఇరుకున పడ్డాయి. తెలుగువాడు కావడంతో టీడీపీ, తెలంగాణ వాడు కావడంతో బీఆర్‌ఎస్, ఎంఐఎం మద్ధతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉన్నందున అటే ఓటు వేసే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ కు 4 రాజ్యసభ సభ్యులు, ఎంఐఎంకు ఒక లోక్‌సభ ఎంపీ ఉన్నారు. ఈ ఐదుగురు ఇండియా కూటమికి ఓటు వేసినా గెలుపు కష్టమే. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.
Also Read:'నోరా ఫతేహి'లా మారుతావా లేదా లేపేయన..? భార్యకు 3 గంటలు జిమ్‌లో చుక్కలు చూపించిన భర్త..!