/rtv/media/media_files/2025/08/06/sc-2025-08-06-16-34-34.jpg)
Supreme Court quashes order banning use of Stalin's name for TN govt schemes
ఇటీవల తమిళనాడులోని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో సీఎం పేర్లు, ఫొటోలు వాడే అంశంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గతంలో ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం ఖండించింది. ప్రభుత్వ స్కీమ్స్‌లో ముఖ్యమంత్రులు, ప్రధాని ఫొటోలను వినియోగించే పాలసీని దేశమంతటా అనుసరుస్తారని స్పష్టం చేసింది. రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దని హెచ్చరించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని అక్కడి ప్రభుత్వం ' విత్ యు స్టాలిన్' పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో అన్నాడీఎంకే పార్టీ నేత సీవీ షణ్ముగం ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొత్తగా తీసుకొచ్చే సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడుకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వీటి గురించి ప్రచారం చేసేటప్పుడు మాజీ సీఎంల ఫొటోలు, పార్టీ గుర్తులు, జెండాలు ఉపయోగించకుండా నిషేధం విధించింది.
Also Read: 'ట్రంప్ టారిఫ్‌లపై మోదీ అందుకే స్పందించడం లేదు'.. మరో బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ
మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేసింది. సంక్షేమ పథకాలను చాలా రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల పేర్లతో అమలు చేస్తున్నారని.. దీనిపై న్యాయపరంగా ఎలాంటి నిషేధాలు లేవని తమిళనాడు ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు హైకోర్టులో దీనిపై పిల్ వేసిన పిటిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు ఈ విషయంలో అంత ఆందోళన ఉంటే అన్ని పార్టీలకు చెందిన నేతలతో ఉన్న స్కీమ్స్‌కు ఆయన ఎందుకు సవాలు చేయలేదని ప్రశ్నించింది.
Also Read: రాబోయే 24 గంటల్లో ఉత్తరకాశీలో భారీ వరదలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!
పలు ప్రభుత్వ స్కీమ్స్‌కు ప్రధాని, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తుల ఫొటోలు వాడుకోవచ్చని సుప్రీంకోర్టు గతంలోనే పర్మిషన్ ఇచ్చినట్లు ధర్మాసనం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని పాటిస్తున్నారని.. మీ రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వాడుకోవద్దని తేల్చిచెప్పింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. అలాగే దీనిపై పిటిషన్ వేసిన అన్నాడీఎంకే నేత షణ్ముగంకు రూ.10 లక్షల జరిమానా వేసింది. వారం రోజుల్లోగా తాము జరిమానా విధించిన సొమ్మును ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయనకు ఆదేశించింది. అలాగే ఆ సొమ్మును పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును డీఎంకే శ్రేణులు స్వాగతించారు.
Also Read: లవర్‌తో పానీపూరి తిన్న చెల్లి.. జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన అన్నయ్య- షాకింగ్ వీడియో