/rtv/media/media_files/2025/12/19/shanthi-2025-12-19-08-24-02.jpg)
భారత సాంకేతిక, ఇంధన రంగాల్లో పెను మార్పులకు నాంది పలుకుతూ పార్లమెంట్(parliament) ప్రతిష్టాత్మకమైన 'శాంతి' బిల్లు 2025(SHANTI Bill)ను ఆమోదించింది. గురువారం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంతో భారత్ తన అణు ఇంధన రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అధికారికంగా తెరిచినట్లయింది. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది భారత సాంకేతిక ముఖచిత్రాన్ని మార్చే ఒక "అద్భుతమైన మలుపు"అని ఆయన అభివర్ణించారు. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సురక్షితమైన విద్యుత్తును అందించడం నుండి గ్రీన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ వరకు, ఈ చట్టం భారత్‌ను స్వచ్ఛమైన ఇంధన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. మన యువతకు, ప్రైవేట్ రంగానికి ఇది అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి, సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ఇదే సరైన సమయం" అని ప్రధాని పేర్కొన్నారు.
శాంతి బిల్లు గతంలో ఉన్న అణుశక్తి చట్టం 1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్(nuclear energy Bill allowing privatisation) డ్యామేజ్ యాక్ట్ 2010 స్థానంలో అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణుశక్తి రంగంలోకి ఇకపై భారతీయ ప్రైవేట్ కంపెనీలు ఎంటర్ అవ్వవచ్చు. అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించేందుకు, నిర్వహించేందుకు వీరికి అనుమతి లభిస్తుంది. అణుశక్తి నియంత్రణ మండలికి స్వయంప్రతిపత్తితో కూడిన చట్టబద్ధ హోదాను కల్పించారు. ఇది భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించడంలో మరింత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. అణు ప్రమాదాల సమయంలో పరిహారం చెల్లించే బాధ్యతను ప్లాంట్ సామర్థ్యం ఆధారంగా క్రమబద్ధీకరించారు. సరఫరాదారులపై ఉన్న కొన్ని కఠినమైన నిబంధనలను సడలించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం సులభతరం అవుతుంది. క్లీన్ ఎనర్జీ కోసం అధునాతన 'స్మాల్ మోడ్యులర్ రియాక్టర్ల' అభివృద్ధికి ఈ బిల్లు పెద్దపీట వేస్తుంది.
Also Read : కర్ణాటకలో చైనా స్పై బర్డ్ కలకలం.. ఇండియన్ నేవీ కోసం పంపిందేనా!
2047 నాటికి 100 గిగావాట్లు
ప్రస్తుతం భారత్ అణుశక్తి ఉత్పత్తి సామర్థ్యం సుమారు 8.8 GW గా ఉంది. శాంతి బిల్లు ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించి, 2047 నాటికి 100 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించి, నెట్ జీరో (Net Zero) లక్ష్యాలను సాధించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాలు బాధ్యత నిబంధనల సడలింపుపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, దేశాభివృద్ధికి ఇది అనివార్యమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.
Also Read : రిటైర్మెంట్ ముందు సిక్స్ లు.. న్యాయవ్యవస్థపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు
Follow Us