/rtv/media/media_files/2025/09/17/151-goats-sacrificed-for-the-sake-of-the-sacrifice-2025-09-17-08-25-47.jpg)
Lorry driver sacrifices 151 goats
Tamil Nadu news : తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఓ లారీ డ్రైవర్ ఏకంగా 151 మేకలను బలిచ్చాడు. దీనికి కారణం తన మొక్కుతీరడమే. ధర్మపురి జిల్లా పెన్నాగరం తాలూకా ఏరియూర్‌కు దగ్గరలో ఉన్న అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య హంసతో పాటు కుమారుడు ఉన్నాడు. అయితే తంగరాజ్ గత ఆరేళ్ల ముందు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగిన ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు. ఎవరూ చికిత్స చేసినా నయం కాలేదు. కొంతమంది మిత్రులు చెప్పిన సమాచారంతో పెన్నాగరం సమీపంలోని బి.అగ్రహారంలో ఉన్న ముత్తు మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. తన ఆరోగ్యం కుదుట పడితే 151 మేకలతో మొక్కు తీర్చుకుంటానని వేడుకున్నాడు. ఆయన కోరుకున్నట్లే ఆరోగ్యం బాగవడంతో రూ.10 లక్షలతో 151 మేకలు కొనుగోలు చేసి మంగళవారం ముత్తు మారియమ్మన్ ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి బలిచ్చాడు. అనంతరం భక్తులకు మాంసాహారంతో విందు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు
ఆస్తుల కోసం అయినవారిని సైతం అంతమొందించడానికి ఎవరూ వెనుకాడటం లేదు. తాజాగా తమిళనాడులో ఆస్తికోసం ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపాడు. వివరాల ప్రకారం..తిరుపత్తూరు సమీపంలోని కందిలి కసినాయకన్‌పట్టి గ్రామానికి చెందిన ఆదిమూలం, వెంకటేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు వెట్రిసెల్వన్, గోమతి ఉన్నారు. సీఏ చదివిన వెట్రిసెల్వన్ చెన్నైలో ఓ ఆడిటర్ వద్ద పనిచేస్తున్నాడు. ఆదిమూలానికి చెన్నైలో మరోక ఇల్లు ఉంది. దాన్ని అమ్మి తనకు మంచి ద్విచక్ర వాహనం కొనివ్వాలని 2023 నుంచి కోరుతున్నాడు. అనేక సార్లు ఒత్తిడి తీసుకువచ్చినా.. తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో వెట్రిసెల్వన్ కత్తెరతో తండ్రిపై దాడిచేశాడు. గాయపడిన ఆయన చికిత్స అనంతరం తన భార్య వెంకటేశ్వరిని తీసుకుని కసినాయకన్‌పట్టి గ్రామం వదిలి తిరుపత్తూరు పట్టణానికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రిసెల్వన్ తన తల్లిని చూసేందుకు చెన్నై నుంచి తిరుపత్తూరు గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలోనూ తన పేర ఆస్తి రాసివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. అందుకు వారు నిరాకరించారు. ఆ గొడవ తర్వాత ఆదిమూలం అక్కడి నుంచి కసినాయకన్‌పట్టికి వెళ్లిపోయాడు. ఆ కోపంతో వెట్రి సెల్వన్ అక్కడున్న ఇనుపరాడ్డుతో తల్లి తలపై కొట్టి పారిపోయాడు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన ఆదిమూలం రక్తపుమడుగులో భార్య మృతదేహాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
చెన్నైలో కారు బీభత్సం....
తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాల ప్రకారం..తిరువేర్కాడు ప్రాంతానికి చెందిన శీనివాసన్ తన మూడేళ్ల కూతురుతో కలిసి మంగళవారం ఉదయం కారులో చెన్నై మధురవాయిల్ నుంచి పూందమల్లి వైపు వెళుతున్నారు. అలా వెళుతున్న క్రమంలో వానగరం సిగ్నల్ వద్ద శ్రీనివాసన్ మరో వాహనాన్ని వారి కారు ఢీకొంది. అయినా శీనివాసన్ తన కారు ఆపకుండా వేగంగా దూసుకెళ్లాడు. వానగరం మార్కెట్ వద్ద మరోసారి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. స్థానికులు, వాహనదారులు గమనించి శీనివాసన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఆపకుండా జనాలను ఢీకొట్టుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. దీంతో ఆయనను వెంబడించిన పోలీసులు వేలప్పన్‌చావడి సిగ్నల్ వద్ద బారికేడ్లు అడ్డుపెట్టి కారును ఆపారు. శీనివాసన్ నిర్లక్ష్యంగా కారు నడపడంతో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వెంటనే అక్కడకు చేరిన స్థానికులు ప్రమాదానికి కారణమైన శీనివాసన్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు అరెస్టు చేసి తిరువేర్కాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
Also Read: వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?