/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pregnent-jpg.webp)
Maharastra Fetus-in-Fetu Case
Fetus-in-Fetu Case: మహిళల గర్భంనుంచి సాధారణంగా కవలలు లేదంటే ముగ్గురు, నలుగురికిపైగా పిల్లలు పుట్టడం చూశాం. అయితే తాజాగా ఓ యువతి కడుపులో బిడ్డ మరి కొన్ని నెలల్లో పురుడుపోసుకునేందుకు సిద్ధమవుతుండగా వైద్య పరీక్షల్లో డాక్టర్లకు ఊహించని షాక్ తగిలింది. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఈ వింత ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది..
ఈ మేరకు బుల్దానా జిల్లాకు చెందిన 32 ఏళ్ల యువతి గర్భం దాల్చింది. ఇందులో భాగంగా ప్రతీ నెల వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటోంది. అయితే తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇక ఎప్పటిలాగే ప్రభుత్వ ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లిన ఆమెకు డాక్టర్లు కళ్లు చెదిరిపోయే న్యూస్ చెప్పారు. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్ ప్రసాద్ అగర్వాల్ చెప్పారు. 9 నెలలు నిండే వరకు ఏ ఒక్క స్కానింగ్‌లో ఈ విషయం బయటకు రాలేదని గైనకాలజిస్ట్ వెల్లడించారు. తాజాగా చేసిన సోనోగ్రఫీ స్కానింగ్‌లో పిండాన్ని గుర్తించినట్లు చెప్పారు. 'స్కానింగ్ ఫొటోలు చూసి ఆశ్చర్యమేసింది. పరీక్షించి చూస్తే తప్ప పిండం ఉన్నట్లు అర్థం కాలేదు. మరో ఇద్దరు గైనకాలజిస్టులకు ఫొటోలు పంపి వారి సూచనలు కూడా తీసుకున్నాం. ఆ పిండం పెద్దగా అభివృద్ధి చెందలేదు. బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది' అని వివరించారు.
ఇక దీనిని 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పిలుస్తారని, కవలలు ఏర్పడే క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ప్రత్యేక సంరక్షణ అవసరముందని డాక్టర్ ప్రసాద్ అగర్వాల్ చెప్పారు. ఈ అరుదైన కేసులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 200 నమోదైనట్లు తెలిపారు. ఇండియాలో 20 మందిలో ఇలాంటి సమస్యలలు తలెత్తినట్లు చెప్పారు. ఇక ఈ వార్త వినగానే సదరు మహిళతోపాటు ఆమె కుటుంబమంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేం వింత, తమకే ఇలా ఎందుకు జరిగిందనే గందరగోళంలో జాతకాలు చూపించడంతోపాటు దీనికి పరిష్కారం చూపించాలని వైద్యులను కోరారు.