శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయం.. హైకోర్టు దర్యాప్తుకి ఆదేశం

శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాల నుంచి దాదాపు 4.54 కిలోల బంగారం మాయమైన వ్యవహారంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఆలయ పవిత్రతను, పారదర్శకతను దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

New Update
Sabarimala temple

శబరిమల ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు ఉన్న బంగారు తొడుగుల నుంచి దాదాపు 4.54 కిలోల బంగారం మాయమైన వ్యవహారంపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఘటన ఆలయ పవిత్రతను, పారదర్శకతను దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ వివాదం 2019లో మొదలైంది. ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాల బంగారు పూత పూసిన రాగి పలకలను మరమ్మతుల కోసం తొలగించారు. అప్పుడు వాటి బరువు 42.8 కిలోలు ఉంది. అయితే, వాటిని మరమ్మతుల కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు బరువుల మధ్య సుమారు 4.54 కిలోల వ్యత్యాసం కనిపించడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) అధికారులు, దీనిని మరమ్మతులకు పంపించేటప్పుడు కోర్టుకు, ప్రత్యేక కమిషనర్‌కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం కూడా వివాదానికి దారితీసింది. అంతేకాకుండా, ఈ విలువైన బంగారు పలకలను ఓ భక్తుడి ద్వారా ఎటువంటి భద్రత లేకుండా చెన్నైకి పంపించడంపై కూడా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు రాజా విజయరాఘవన్, కె.వి. జయకుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇది చాలా తీవ్రమైన అంశం అని, దీనిపై కచ్చితంగా లోతైన విచారణ జరగాలని వ్యాఖ్యానించింది. టీడీబీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు (సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) మూడు వారాల్లోగా ఈ విషయంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే, ఈ విచారణకు టీడీబీ పూర్తి సహకారం అందించాలని కోర్టు ఆదేశించింది.

వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారెంటీతో తయారు చేశారు. అయితే, ఆరు సంవత్సరాలలోనే లోపాలు తలెత్తడం, వాటి మరమ్మతుల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఆలయ నిర్వహణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోర్టు సూచించింది. ఈ విచారణ ద్వారా అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు