New Update
/rtv/media/media_files/2025/12/30/india-to-fortify-delhi-with-capital-dome-2025-12-30-16-17-05.jpg)
India to Fortify Delhi with Capital Dome
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి(pahalgam terror attack), ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుడు(Delhi Bomb Blast) ఘటనలు భారత్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్'(Capital Dome) అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. శత్రు దేశాల నుంచి డ్రోన్లు, మిసైల్స్ వంటి వైమానిక దాడులు జరగకుండా దేశ రాజధానిని ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ రక్షించనుంది.
దేశీయ రక్షణ వ్యవస్థ
రక్షణ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. క్యాపిటల్ డోమ్‌ను దేశీయ సాంకేతికతోనే రూపొందించనున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఈ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయనుంది. శత్రు దేశాల నుంచి మాత్రమే కాకుండా ఢిల్లీ చుట్టూ ఎలాంటి దాడులు జరగకుండా క్యాపిటల్ డోమ్ రక్షించనుంది. 24/7 నిరంతరం ఇక నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) చుట్టూ అత్యాధునిక రక్షణ వలయం ఉండనుంది. ఈ వ్యవస్థ అనేది వివిధ పరిధిలు, ఎత్తు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఒక షీల్డ్‌గా పనిచేయనుంది. ఇందులో రెండు అత్యాధునిక మిసైల్ వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (QRSAM) కాగా రెండవది వర్టికల్లీ లాంచ్‌డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (VLSRSAM).
QRSAM
QRSAM అనేది దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత వేగంగా స్పందించే, సులభంగా తరలించగలిగే కీలక భాగం. దీన్ని 8x8 భారీ మొబిలిటీ వాహనాలపై అమర్చారు. దీంతో ఇది యుద్ధ సమయాల్లో ఒకచోట నుంచి మరో చోటుకి సులభంగా ప్రయాణించగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే వాహనం కదులుతున్నప్పుడు కూడా శత్రు లక్ష్యాలను గుర్తించగలదు, వాటిని వెంబడించి దాడులు చేయగలదు. 25 నుంచి 30 కిలోమీటర్ల పరిధి వరకు దాడులు చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. తక్కువ ఎత్తులో ప్రయాణించే క్రూయిజ్ మిస్సైళ్లు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్‌లను అత్యంత వేగంగా అడ్డుకోగలదు.
VL-SRSAM
QRSAM తో పాటు, VL-SRSAM కూడా కీలక పాత్ర పోషించనుంది. ముందుగా దీన్ని భారత నౌకాదళం కోసం అభివృద్ధి చేశారు. ఇప్పుడు దీన్ని భూతల రక్షణ అవసరాల కోసం మార్పులు చేశారు. దీని అతిపెద్ద బలం వర్టికల్ లాంచ్ సామర్థ్యం. ఈ లాంచర్‌ను ఒక దిశ నుంచి మరో దిశకు తిప్పాల్సిన అవసరం లేకుండానే 360 డిగ్రీల దిశలో లక్ష్యాలను ఛేదించగలదు. ఢిల్లీ లాంటి జనసాంద్రత కలిగిన నగరాల్లో ముప్పు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేం. అందుకే అన్ని దిశల నుంచి రక్షణ కల్పించే ఓమ్నీడైరెక్షనల్ సామర్థ్యం చాలా ముఖ్యం. VL-SRSAM అనేది ఇప్పటికే సక్సెస్ అయిన 'అస్త్ర' ఎయిర్ -టు -ఎయిర్ క్షిపణి సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉన్న యాక్టివ్ రాడార్ హోమింగ్ వల్ల శత్రు లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలదు.
క్యాపిటల్ డోమ్‌లో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ (DEWs) అనేది ఓ విప్లవాత్మక ఫీచర్. ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా నిఘా, శత్రువులపై దాడులు చేసేందుకు చిన్నపాటి కమర్షియల్ డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ఢిల్లీ లాంటి జనసాంద్రత ఉన్న నగరాల్లో చిన్న లక్ష్యాలపై ఖరీదైన క్షిపణులను ప్రయోగించడం ఆర్థికంగా నష్టం ఉంటుంది. అలాగే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. డిరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్(DEWs)లో హై-పవర్ మైక్రోవేవ్ పరికరాలు, హై-ఎనర్జీ లేజర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవి సాఫ్ట్ కిల్, హార్ట్ కిల్‌గా పనిచేస్తాయి. మైక్రోవేవ్ పరికరాల ద్వారా డ్రోన్‌లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలను జామ్ చేయడం లేదా మొరాయించేలా చేస్తుంది. లేజర్ సిస్టమ్స్ ద్వారా డ్రోన్ బాడిని పేల్చివేస్తాయి.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్
క్యాపిటల్ డోమ్ అనేది ఒకదానితో మరొకటి అనుసంధానించబడిన (Networked) విధానంపై ఆధారపడి ఉంటుంది. రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్లు, కమ్యూనికేషన్ హబ్‌లు నిరంతరం సమాచారాన్ని సేకరించి.. దాన్ని ఒకే చోట ఉన్న సెంట్రల్ కమాండ్- అండ్ -కంట్రోల్ సిస్టమ్‌కు పంపిస్తాయి. ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ పిక్చర్ వ్యవస్థ ఆకాశంలో ఉండే పరిస్థితిని ఒకే నెట్‌వర్క్ ద్వారా చూపిస్తుంది. శత్రువుల నుండి ముప్పు వచ్చినప్పుడు.. అది ఎలాంటి రకానికి చెందినదో ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. అలాగే ఏ ఆయుధాన్ని ఉపయోగించాలో ఆటోమేటిక్‌గా నిర్ణయిస్తుంది. చిన్నపాటి డ్రోన్ల కోసం లేజర్లను, అలాగే పెద్దవి, వేగంగా వచ్చే లక్ష్యాల కోసం క్షిపణులను వినియోగిస్తుంది. ఈ క్యాపిటల్ డోమ్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. ఢిల్లీ అనేది ఆసియా ప్రాంతంలోనే అత్యంత సురక్షితమైన, బలమైన ప్రాంతంగా మారుతుంది.
తాజా కథనాలు
Follow Us