/rtv/media/media_files/2025/06/13/YXmE8pDcMVaHp9x7oBgr.jpg)
Medical College
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన కొన్ని సెకన్లలోనే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ విమానం సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోవడంతో 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. దీంతో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మరో 50 మంది మెడికోలు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సపొందుతున్న వారిలో ఈరోజు మరో నలుగురు మృతిచెండడంతో మరింత విషాదాన్ని మిగిల్చింది. గాయపడిన వారిలో మరికొంతమంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతాయో అని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు సంఘటనకు ఎలాంటి సంబంధం లేకుండా విమానం హాస్టల్ భవనంపై పడడం తో ఇంతమంది మెడికోలు చనిపోవడాన్ని వారి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ భోజనం చేస్తున్న సమయంలో మెస్ పైనే విమానం కూలడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని తెలుస్తోంది.
ఒకరు మిస్....
ఇక ఈ ప్రమాదం సమయంలో అక్కడే ఉన్న మరో మెడికో కనబడకుండా పోయినట్లు అధికారులు ప్రకటించారు. 24 గంటలుగా ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరోసారి గాలిస్తే పురోగతి ఉండవచ్చని వారు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ, మెడీకోలతోసహ ఇప్పటి వరకు 269 మంది చనిపోయారు.
ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి...
ప్రమాద సమయంలో అప్రమత్తమైన మెడికల్ విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో తమిళనాడుకు చెందిన ఓ పీజీ విద్యార్థి కూడా ఉన్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యాహ్నం 1:30 గంటలకు భోజనం చేసేందుకు తాము 5వ అంతస్తుకు వెళ్లామని చెప్పారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడం, దట్టమైన పొగ కమ్ముకోవడం ఒక్కసారిగా జరిగాయన్నారు. భయంతో అందరం కిందకు పరుగులు తీశామన్నారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు పరుగులు తీసేటప్పటికీ అక్కడ కూడా దట్టమైన పొగలు వ్యాపించడంతో ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకి దూకి ప్రాణాలు కాపాడుకున్నానని అన్నాడు. అలా తప్పించుకున్న వారిలో తనతో పాటూ 20 నుండి 30 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పాడు.