Maoists: మావోయిస్టుల్లో విభేదాలు.. మల్లోజులను ద్రోహిగా పేర్కొన్న కేంద్ర కమిటీ

మావోయిస్టు పార్టీలో విభేదాలు పొడ చూపినట్టు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్‌ ఎలియాస్‌ భూపతి చేసిన ప్రకటన ఆ పార్టీలో చిచ్చురేపింది. ఆయనను పార్టీ ద్రోహిగా ప్రకటించింది.

New Update
Maoists

Maoists party

వరుస ఎన్‌కౌంటర్ల(Encounters) తో కేంద్రస్థాయి నాయకులను కోల్పొతున్న మావోయిస్టు పార్టీలో విభేదాలు పొడ చూపినట్టు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్‌ ఎలియాస్‌ భూపతి చేసిన ప్రకటన ఆ పార్టీలో చిచ్చురేపింది. అది పార్టీ నిర్ణయం కాదంటూ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌ పేరిట మరో లేఖ విడుదలైంది.ఈ నేపథ్యంలో సీనియర్‌ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్‌ ఎలియాస్‌ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. అతడిని ద్రోహిగా పేర్కొంటూ.. ఆయన వద్ద ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేకపోతే వాటిని పీపుల్స్‌ గొరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. ఇటీవల ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను కేంద్ర కమిటీ తప్పుబట్టింది.

మావోయిస్టు పార్టీ(maoist party crisis in telangana) పై మల్లోజుల వేణుగోపాల్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర కమిటీ ఆరోపిస్తోంది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై అతడి ప్రకటనను కమిటీ ఖండించింది. ఆయన లొంగిపోయేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పేర్కొంది. కాగా భూపతి.. సీనియర్‌ మావోయిస్టు నేత మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్‌ కిషన్‌జీకి తమ్ముడు.

వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులతో చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘాలు పదేపదే కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాయి. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా కనిపించడంలేదు.  అదే సమయంలో గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ కేంద్రం మాత్రం మావోయిస్టుల ఏరివేతకే సుముఖంగా ఉన్నామని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో భూపతి చేసిన ప్రకటన పార్టీలో చర్చకు దారితీసింది.  ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టు అగ్రనేతల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. భూపతి ప్రకటనను జగన్‌ ఖండించిన విషయం తెలిసింది. ఇదిలా ఉండగానే  అభయ్, వికల్ప్‌ పేరుతో సోమవారం మరో ప్రకటన విడుదలైంది. కేంద్ర కమిటీ సభ్యులైన అభయ్‌ పేరుతో దేవ్‌జీ, వికల్ప్‌ పేరుతో హిడ్మా... ఈనెల 20న మరో  లేఖ రాశారు. ఆయుధాలను అప్పగించి ప్రజల ప్రయోజనాలకు ద్రోహం చేయడం తమ విధానం కాదని, ప్రజాయుద్ధాన్ని కొనసాగించి తీరుతామని వారు పేర్కొనడం గమనార్హం. ఇటీవల సోను ఎలీయాస్‌ భూపతి చేసిన ప్రకటనను కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, దండకారణ్యం ప్రత్యేక జోనల్‌ కమిటీ తిరస్కరిస్తున్నట్లు వారు తాజా ప్రకటనలో వెల్లడించారు. మారిన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పోరాటం కొనసాగించే తీరుతామని స్పష్టం చేశారు. మరణించిన పార్టీ కార్యదర్శి నంబాళ కేశవరావు ఎలియాస్‌ బసవరాజు శాంతి చర్చల కోసం చేసిన ప్రయత్నంలో భాగమే ఆయుధాల అప్పగింత అని సోను ప్రకటించడం వాస్తవాలను వక్రీకరించడమేనని వారు ఈ ప్రకటనలో వివరించారు. అంతేకాదు ఆయుధాల అప్పగింతకు సంబంధించి సోనూ విడుదల చేసిన ప్రకటనలోని ప్రతి అంశాన్నీ వారు ఖండించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అభయ్‌ పేరుతో ప్రకటనలు ఇచ్చే అధికారం సోనుకు లేదని పేర్కొనడం సంచలనం రేపుతోంది. అయితే, శాంతి చర్చలకు మాత్రం ఇప్పటికీ సిద్దంగానే ఉన్నామని, ఉద్యమంలో వెనుకంజ, ఓటములు తాత్కాలికమేనని, అంతిమ విజయం ప్రజలదే వారు ప్రకటనలో పేర్కొన్నారు.

'కగార్‌' ఆపరేషన్‌తో ఉక్కిరిబిక్కిరి

కాగా వచ్చే మార్చినాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రతీనబూనిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah) అపరేషన్‌ కగార్‌(operation kagar) పేరుతో కేంద్రబలగాలను పూర్తి స్వేచ్ఛ నిచ్చాడు. దీంతో వరుసగా జరిగిన ఎన్‌ కౌంటర్లలలో మావోయిస్టు పార్టీ కేంద్ర స్థాయి నాయకులతో పాటు కేంద్రకమిటి కార్యదర్శి మృతి చెందారు. ఎన్‌ కౌంటర్లలో  కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెం బాలకృష్ణ, పరేవశ సోరెన్ కూడా మృతి చెందారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ వంటివారు కూడా కన్నుమూశారు.  ఈ క్రమంలో భూపతి శాంతి చర్చల ప్రతిపాదనను మిగిలిన నాయకులు వ్యతిరేకించడంతో పార్టీ విభేదాలు వెలుగు చూశాయి.

Also Read :  తండ్రి వర్ధంతి కోసం భారత్‌ వచ్చిన టెక్కి.. తిరిగి అమెరికా వెళ్లేందుకు రూ.7 లక్షల ఖర్చు

Advertisment
తాజా కథనాలు