Central Budget : తెలంగాణకు నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌..రాష్ట్ర ప్రాజెక్టులకు నిధులు నిల్‌

కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది. రాష్ట్రం చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం చిల్లీగవ్వ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టులకు భారీ కేటాయింపులుంటాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది.

New Update
FotoJet (19)

Central Budget leaves Telangana disappointed

Central Budget :  అందరూ ఊహించినట్లే కేంద్రబడ్జెట్‌(Union Budget 2026) లో తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది. రాష్ట్రం చేపట్టిన కీలక అభివృద్ధి ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం చిల్లీగవ్వ కేటాయించలేదు. బడ్జెట్‌లో వివిధ ప్రాజెక్టులకు భారీ కేటాయింపులుంటాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు.. కేంద్రానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా.. కేంద్రం ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, జాతీయ రహదారుల అభివృద్ధి, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్‌ సమగ్ర మురుగునీటి శుద్ధి, మెట్రో రైల్‌ ప్రాజెక్టు విస్తరణ, కొత్త రైల్వే లైన్లు.. ఇలా రాష్ర్ట ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు నిధులు కోరినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో ఆయా పనుల పురోగతిపై ప్రభావ చూపే అవకాశం కనిపిస్తోంది.

Also Read :  యూజీసీ కొత్త రూల్స్‌లో ఏముంది.. జనరల్ కేటగిరీ విద్యార్థుల నిరసనలకు కారణాలేంటి ?

అన్నింటికి మొండి చేయే

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే వంటి ప్రాజెక్టులకు కేంద్రం నయాపైసా విదల్చలేదు. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయనున్న ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు రేడియల్‌ రోడ్ల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని అనుకున్నప్పటికీ రాష్ర్ట ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ ఖర్చులో 50% భరించేందుకు సిద్ధమైంది. దీనికి కేంద్రం నుంచి రూ.34,367.62 కోట్లు మంజూరు చేయాలని, త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు పూర్తి చేయాలని రాష్ట్రం విన్నవించినప్పటికీ.. బడ్జెట్‌లో మాత్రం ఒక్కపైసా దక్కలేదు. ఓఆర్‌ఆర్‌ను దాటి హైదరాబాద్‌ను విస్తరించడంతో పాటు.. 10 కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ సమగ్ర టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక క్లస్టర్లు, థీమాటిక్‌ హబ్‌లను అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వం వాటికి.. రూ.45,000 కోట్లు కోరినప్పటికీ కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం గమనార్హం. 

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేకు అంతే..

అంతేకాదు ఎగుమతుల వృద్ధి కోసం బందరు పోర్టు నుంచి హైదరాబాద్‌ సమీపంలోని ప్రతిపాదిత మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌(డ్రై పోర్టు) వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనికి రూ.17,000 కోట్లు మంజూరు చేయాలని కోరినప్పటికీ నయా పైస ఇవ్వలేదు. జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక, యాత్రా కేంద్రాలను అనుసంధానించే 16 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను కూడా కేంద్రం పట్టించుకోలేదు. హైదరాబాద్‌ -శ్రీశైలం ఎన్‌హెచ్‌-765పై ఫోర్‌లేన్‌ ఎలివేటెడ్‌ కారిడార్, హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 ఆరు లేన్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి.

దేశ భవిష్యత్‌ పరిశ్రమగా చెప్పుకొనే సెమీకండక్టర్‌ మిషన్‌లో కూడా  తెలంగాణకు చోటు దక్కలేదు. తెలంగాణలో సెమీకండక్టర్‌ పార్క్‌ ఏర్పాటుకు రాష్ట్రం చేసిన ప్రతిపాదనపై కూడా కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదు.  ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న బయ్యారం స్టీల్‌ ప్లాంట్, నవోదయ విద్యాలయాలు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి హామీల అమలుపై కూడా కేంద్రం ఊసెత్తకపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

తెలంగాణపై ఎప్పటికీ శీతకన్నే (నా)

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రం బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేస్తూనే ఉంది. తాజాగా అదే మళ్లీ పునరావృతం అయింది. కనీసం ప్రజల జీవన ప్రమాణాలతో ముడిపడిన ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఎటువంటి నిధులు కేటాయించలేదు.  రూ.14,100 కోట్లతో ప్రతిపాదించిన ‘మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు’ను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీనికోసం భూ హక్కుల బదిలీ వేగవంతం చేయాలని, ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం గ్రాంటుగా ఇవ్వాలని కోరినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు.. హైదరాబాద్‌ సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా.. 7,444 కి.మీ పొడవుతో సమగ్ర మురుగు నీటి నెట్‌వర్క్‌ అభివృద్ధికి రూ.17,212.69 కోట్ల సాయం కోరితే  కేంద్రానికి పట్టింపేలేదు. మల్లన్నసాగర్‌ నుంచి మూసీ నదికి నీటిని మళ్లించి.. నది శుద్ధి, హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కోసం రూ.6,000 కోట్ల ఆర్థిక సాయంపైనా కూడా  బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. వరంగల్‌ నగర భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.4,170 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పథకానికి కేంద్ర సాయాన్ని కోరినా.. పట్టించుకోలేదు. - Minister Nirmala Sitharaman

Also Read :  Budget 2026: నిర్మలా సీతారామన్ చెప్పిన ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటో తెలుసా?

మెట్రో రైలు ఫేజ్‌-2కు లేనట్లే

ఇక రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన162 కి.మీ పొడవున హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 విస్తరణ,.. ఫేజ్‌-2ఎ లైన్‌కు రూ.24,269 కోట్లు, ఫేజ్‌-2బి లైన్‌కు రూ.19,759 కోట్లుగా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించి  దీన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల 50:50 జాయింట్‌ వెంచర్‌గా రాష్ర్టం ప్రతిపాదించినా.. బడ్జెట్‌లో మాత్రం నిధుల ఊసేలేదు. ఆదిలాబాద్, కొత్తగూడెం, పెద్దపల్లిలలో మూడు కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు పంపించినా స్పందన లేదు. వికారాబాద్‌-కృష్ణా, కల్వకుర్తి-మాచర్ల, గద్వాల్‌-డోర్నకల్, కాచిగూడ-జగ్గయ్యపేట, పటాన్‌చెరు-ఆదిలాబాద్, బోధన్‌-లాతూర్‌ రోడ్, అక్కనపేట బైపాస్, పాండురంగాపురం-భద్రాచలం రోడ్‌ వంటి పలు రైల్వే మార్గాల ప్రతిపాదనలకూ కేంద్రం పట్టించుకోలేదు. ట్రాన్స్‌కో, డిస్కంలు ప్రతిపాదించిన ఆరు పథకాల కోసం రూ.281.6 కోట్లు ఇవ్వాలని.. కేంద్ర విద్యుత్‌ శాఖకు రాష్ట్రం చేసిన ప్రతిపాదనకూ కూడా ఎలాంటి హామీ దక్కలేదు. - 2026 budget live

Advertisment
తాజా కథనాలు