/rtv/media/media_files/2025/10/18/an-irreparable-blow-to-the-maoist-party-2025-10-18-13-06-10.jpg)
An irreparable blow to the Maoist party
Maoist Party: దశాబ్ధాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమం దాదాపు ముగింపు దశకు చేరుకుంది. గడచిన కొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆఫరేషన్ కగార్ నేపథ్యంలో కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు హతం కావడంతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు అనేకమంది మృత్యువాత పడ్డారు. ఉద్యమ పంథాను మార్చుకోవలసిన అవసరం తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టు నేతలు చేసిన ప్రయాత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. వచ్చే ఏడాది మార్చినాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని హోమ్‌మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. చర్చల ప్రసక్తే లేదని లొంగిపోవడం తప్ప మరో దారి లేదని స్పష్టం చేశారు. దీంతో పలువురు మావోయిస్టు నేతలు లొంగుబాటుకు సిద్ధమయ్యారు. మావోయిస్ట అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ ఎదుట లొంగిపోయాడు. ఆయనతో పాటు 60 మంది మావోయిస్టులు లొంగుబాట బాట పట్టారు.
ఆ మరునాడే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న కూడా తన ఉద్యమానికి వీడ్కోలు పలికారు. ఆయనతోపాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్ (రాజ్‌మాన్ మాంధవీ), రాజు సలాం, వెన్ను దట్టి (సంతు), మాడ్ డివిజన్ కార్యదర్శి రణిత సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో శుక్రవారం వీరంతా ఆయుధాలు అప్పగించారు. దేశంలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం మావోయిస్టు చరిత్రలో ఇదే మొదటిసారి. కాగా గడిచిన మూడు రోజుల్లోనే 348 మంది మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్‌ల్లో జన జీవన స్రవంతిలో కలవడం సంచలనంగా మారింది.
వరుస ఎన్‌కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో మావోయిస్టులతోపాటు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. దేశవ్యాప్తంగా సుమారు 3 వేలమంది మావోయిస్టులు ఉన్నట్లు అప్పట్లో నిఘా వర్గాలు వెల్లడించాయి.అయితే వరుస ఎన్‌కౌంటర్లతో వీరి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం మరో 500 మంది మాత్రమే మిగిలారని తెలుస్తోంది. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో 250మంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ స్పెషల్ జోనల్ కమిటీలో 70మంది, తెలంగాణ కమిటీలో 60 మంది, ఈస్ట్రన్ రీజనల్‌బ్యూరోలో 70 మంది, ఒడిషా రాష్ట్ర కమిటీలో 50 మంది మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. వీరుకాక మిలీషియా సభ్యులు సుమారు 5000 వరకు ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, 20 మందిగా ఉన్న కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య10 కి పడిపోయింది. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు ఆరుగురు, జార్ఖండ్,ఛత్తీస్ గఢ్ నుంచి ఇద్దరేసి చొప్పున ఉన్నారు. వీరంతా ఆరుపదుల వయస్సు దాటినవారే.
ఇటీవల కేంద్ర కమిటీ కార్యదర్శిగా నియమితులైనట్లు ప్రచారం జరిగిన తెలంగాణకు చెందిన వారిలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (62) ప్రస్తుతం మాడ్ ఏరియాలో పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. కేంద్ర కమిటీ సలహాదారు, సీనియర్ మావోయిస్టు నేత అ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి (75) అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఇక పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న (64) తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. పాక హన్మంతు అలియాస్ ఉకే గణేశ్ (64) ఒడిసాలో బాధ్యతలు నిర్వహిస్తుండగా. మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ (73) పార్టీ రక్షణలో ఉన్నారు. పసునూరి నరహరి అలియాస్ విశ్వనాధ్ (58) జార్కండ్‌లో శరందా ఏరియా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఛత్తీస్ గఢ్‌కు చెందిన మాడ్వి హిడ్మా (51) పార్టీలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మజ్జిదేవ్ అలియాస్ రణధీర్ (56) మాడ్ ఏరియా బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.
కాగా తెలంగాణ రాష్ర్ట కమిటీలో బడే చొక్కారావు (46), కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ (49), కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ (50) మాత్రమే ఉన్నారు. ఇక వీరితోపాటు ఉన్న దళ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేవలం 60 మంది మాత్రమేనని ఉన్నారని, దళ సభ్యుల్లో మిగిలనవారు కూడా ఇతర రాష్ట్రాల వారేనని నిఘా వర్గాలు చెప్తున్నాయి. మావోయిస్టు పార్టీ సారథిగా తిప్పిరి తిరుపతికి బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరిగినా.. లొంగిపోయిన మావోయిస్టులు మాత్రం అదేం లేదంటున్నారు. మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ వెనక కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానాలను ప్రజా సంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజా లొంగుబాట్ల నేపథ్యంలో మిగిలినవారు కూడా లొంగుబాట పడుతారా? లేక ఉద్యమాన్ని కొనసాగిస్తారా అనేది త్వరలోనే తేలనుంది.
Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్