Ghost Sims: 'ఘోస్ట్ సిమ్'లతో పాక్ హ్యాండ్లర్లతో నిందితుల చాటింగ్!

ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితులు ఉగ్రవాద కార్యకలాపాలను అత్యంత రహస్యంగా సాగించడానికి 'ఘోస్ట్ సిమ్' కార్డులను, అత్యాధునిక ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు కొన్ని ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వాడేవారు.

New Update
_Pakistani handlers

ఢిల్లీ పేలుళ్ల కేసు(delhi blast case) లో NIA జరుపుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుట్రలో కీలక నిందితులుగా ఉన్న డాక్టర్లు, తమ ఉగ్రవాద కార్యకలాపాలను అత్యంత రహస్యంగా సాగించడానికి 'ఘోస్ట్ సిమ్' కార్డులను, అత్యాధునిక ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో పాటు ఇతర నిందితులు పట్టుబడకుండా ఉండేందుకు రెండు, మూడు మొబైల్ ఫోన్లను వాడేవారు. పాకిస్థాన్‌లోని తమ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరపడానికి వీరు నకిలీ ఆధార్ కార్డులతో తీసుకున్న సిమ్ కార్డులను (ఘోస్ట్ సిమ్స్) ఉపయోగించేవారు.

నిందితులు డాక్టర్ ముజమ్మీల్ గనాయ్, ఆదిల్ రాథర్, ఇతర నిందితులు ఈ సందేశాలను అందిపుచ్చుకునేందుకు డ్యూయల్ ఫోన్ ప్రొటోకాల్ పద్ధతిని అనుసరించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నిందితులు రెండుమూడు మొబైల్ హ్యాండ్‌సెట్లను వాడారని, ఒకదాన్ని రోజువారీ పనులకోసం ఉపయోగిస్తే.. మిగతా వాటిని వాట్సాప్ కోసం ప్రత్యేకంగా ఒకటి, టెలిగ్రామ్ కోసం మరోటి వినియోగించినట్లు తేల్చారు. ఈ తరహా ఫోన్లను దర్యాప్తు అధికారులు ‘టెర్రర్ ఫోన్’లుగా అభివర్ణిస్తున్నారు.

ఈ కేసులో నిందితుల మొబైల్ ఫోన్లను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు, దర్యాప్తు అధికారులు పాకిస్థాన్ నుంచి వచ్చిన కోడ్‌లను గుర్తించారు. వాటిల్లో ‘ఉకాసా’, ‘ఫైజాన్’, ‘హాష్మీ’ అనే కోడ్‌లు ఎక్కువగా ఉన్నట్లు నిగ్గుతేలింది. ఆ కోడ్‌లను డీకోడ్ చేస్తున్నారు. మరోవైపు నిందితులు ఘోస్ట్ సిమ్ కార్డులను ఎలా పొందగలిగారనేదానిపై జమ్మూకశ్మీర్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఇందుకు సంబంధించిన ఓ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఉగ్ర డాక్టర్లకు పాకిస్థాన్ లేదా పీవోకేకు చెందిన మాడ్యూల్స్ ప్రత్యేక శిక్షణనిచ్చినట్లు అనుమానిస్తున్నారు.

నిందితులు కొన్ని ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లను వాడేవారు. ఈ యాప్‌ల ప్రత్యేకత ఏంటంటే.. ఫోన్‌లో సిమ్ కార్డు లేకపోయినా, కేవలం వై-ఫై ద్వారా సందేశాలు పంపవచ్చు. పేలుడు పదార్థాల తయారీపై హ్యాండ్లర్ల నుండి వీరు ఈ రహస్య యాప్‌ల ద్వారానే శిక్షణ పొందినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది.

Also Read :  ప్రియాంక గాంధీకి హైకమాండ్ కీలక బాధ్యతలు

ఏమిటీ 'ఘోస్ట్ సిమ్'?

అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారు ఇతరుల గుర్తింపు కార్డులను దొంగిలించి లేదా నకిలీ పత్రాలను సృష్టించి తీసుకునే సిమ్ కార్డులను 'ఘోస్ట్ సిమ్'(ghost SIM Card) అంటారు. దీనివల్ల నేరం జరిగినప్పుడు పోలీసులు ఆ నంబర్‌ను ట్రేస్ చేస్తే, దానికి అసలు నిందితుడితో సంబంధం లేని వ్యక్తుల వివరాలు బయటపడతాయి. ఇది విచారణను పక్కదారి పట్టించేందుకు ఉగ్రవాదులు, సైబర్ నేరగాళ్లు వాడే వ్యూహం.

Also Read :  రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌లో అగ్నిప్రమాదం.. వందలాది బైకులు బుగ్గి!

కేంద్ర ప్రభుత్వం కీలక నిబంధన

ఇలాంటి ఉగ్రవాద నెట్‌వర్క్‌లను అరికట్టడానికి కేంద్ర టెలికమ్ శాఖ (DoT) గతేడాది నవంబర్‌లో కఠిన నిబంధనలు తెచ్చింది.

సిమ్ ఉంటేనే యాప్: కొత్త నిబంధన ప్రకారం, ఏ సిమ్ కార్డుతో అకౌంట్ రిజిస్టర్ అయిందో, ఆ సిమ్ ఫోన్‌లో ఉంటేనే మెసేజింగ్ యాప్ పనిచేస్తుంది.

ఆటోమేటిక్ లాగౌట్: ఒకవేళ యూజర్ ఫోన్ నుండి సిమ్ తీసేసినా లేదా ఫోన్ మార్చినా యాప్ ఆటోమాటిక్‌గా లాగౌట్ అవుతుంది. దీనివల్ల సిమ్ లేకుండా ఇంటర్నెట్ ద్వారా సందేశాలు పంపే వీలుండదు.
ఎన్ఐఏ ప్రస్తుతం ఈ నిందితుల వద్ద ఉన్న డిజిటల్ డేటాను విశ్లేషిస్తూ, ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందో ఆరా తీస్తోంది.

Advertisment
తాజా కథనాలు