/rtv/media/media_files/2026/01/04/fotojet-80-2026-01-04-13-31-28.jpg)
Fire breaks out in railway station parking
Thrissur : కేరళలోని త్రిసూర్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వందలాది బైకులు దగ్ధమయ్యాయి. బైక్ పార్కింగ్ ప్రాంతంలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పెయిడ్-పార్కింగ్ షెడ్‌లో ఉదయం 6.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 పక్కన జరిగిన ఈ ఘటనలో 200లకు పైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఓ విద్యుత్తు తీగ బైక్‌లపై తెగిపడడంతో నిప్పు రవ్వలు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో 400 వరకు ద్విచక్ర వాహనాలు అక్కడ ఉన్నాయని.. వాటిలో చాలావరకు కాలిపోయాయని తెలిపారు. వాహనాలతో పాటు టిన్ షీట్‌ల షెడ్ మంటల్లో దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్, ఇంధన లీకేజీ లేదా ఇతర కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు అగ్నిమాపక శకటాల సాయంతో మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
500కు పైగా బైక్‌లను నిలిపివుంచే సామర్థ్యం ఉందీ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో. మంటల వల్ల పలు వాహనాల పెట్రోల్ ట్యాంకులు పగిలాయి. అందులోని పెట్రోల్ ఎగజిమ్మడం వల్ల మంటలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. రైల్వే పార్కింగ్ సిబ్బంది నిర్లక్ష్యమే అగ్ని పెద్దఎత్తున వ్యాపించడానికి కారణమని భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, తొలుత ఒకే బైక్ నుంచి తేలికపాటి మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో అగ్నిమాపక పరికరం అందుబాటులో ఉండి ఉంటే, పరిస్థితి ఇంత తీవ్రంగా మారేది కాదని చెబుతున్నారు. బలమైన గాలుల కారణంగా మంటలు నిమిషాల్లోనే ఇతర వాహనాలకు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రయాణికులు, సమీప నివాసితులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆరిపోయినప్పటికీ, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో ప్రయాణికులు, స్టేషన్ సిబ్బంది శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే వాహన యజమానులు సంఘటనస్థలానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది రోజువారీ ప్రయాణికులే. తమ వాహనాలు కాలి బూడిదవ్వడం చూసి ఆవేదన చెందారు.
Follow Us