నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలను కాల్చిపడేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తెల్కపల్లిలో పర్యటించిన ఆయన “పదేళ్ల ప్రజా ప్రస్థానం మర్రన్న” పాదయాత్ర నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే.. కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తన చేతిలో ఓడిపొతాననే భయంతో కాంగ్రెస్ నేతలు తనపై తప్పుడు వార్తలు సృష్టించి వాటిని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు ఇకనైనా తమ పద్దతి మార్చుకోవాలన్న ఎమ్మెల్యే.. లేకుండా వారిని కాల్చేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. కేసీఆర్ హయాంలో గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో నెంబర్ వన్‌గా నిలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ గతంలో ఏ ప్రభుత్వం చేయని సాహసం చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఎకరాకు కాళేశ్వరం నీరు అందిస్తున్నారన్నారు. అంతే కాకుండా గ్రామస్థాయిలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నారని వెల్లడించారు. రైతులు పంటలు పండించేందుకు రైతుబంధు ద్వారా వారిని ఆదుకుంటున్నారని వివరించారు.
ఇదంతా చూస్తున్న విపక్ష నేతలు ఏదో ఒక విధంగా ప్రభుత్వం బురద చల్లాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. సీఎం కేసీఆర్‌పై లేనిపోని అబాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. సొంత రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తారని కొందరు అంటున్నారన్న ఆయన.. కేసీఆర్ తెలంగాణలో ఏం చేయలేదో చెప్పాలన్నారు. మహారాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలులో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారా అన్నారు. ఇతర రాష్ట్రాల నేతలు మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు.