Liver Diseases: మల విసర్జన సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్లే

ఉదయం మల విసర్జన సమయంలో కనిపించే కొన్ని మార్పుల ద్వారా కాలేయ ఆరోగ్య స్థితిని గుర్తించవచ్చు. మల రంగులో లేత పసుపు-మట్టి రంగు, నల్లని, ఎర్రని మలం, ముదురు గోధుమ రంగు మలం వంటి లక్షణాలను సకాలంలో గుర్తిస్తే కాలేయం పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు.

New Update
Liver Diseases and defecation

Liver Diseases And Defecation

శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది రక్తాన్ని శుభ్రం చేయడం నుంచి జీర్ణక్రియలో కీలక పాత్ర పోషించడం వరకు అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిలో కాలేయ సమస్యలు తలెత్తుతున్నాయి. కాలేయం దెబ్బతినడం మొదలుపెట్టినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా.. ఉదయం మల విసర్జన సమయంలో కనిపించే కొన్ని మార్పుల ద్వారా కాలేయ ఆరోగ్య స్థితిని గుర్తించవచ్చు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తిస్తే కాలేయం పూర్తిగా దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మల విసర్జన సమయంలో కనిపించే రంగులో మార్పులు, కాలేయానికి సంబంధించిన సమస్యలకు ముఖ్యమైన సంకేతల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

 లేత పసుపు-మట్టి రంగు మలం:

  • సాధారణంగా మలం గోధుమ,ముదురు గోధుమ రంగులో ఉంటుంది. కాలేయం ఉత్పత్తి చేసే పిత్తం కారణంగా ఈ రంగు వస్తుంది. అయితే మలం రంగు లేత పసుపు లేదా మట్టి రంగులోకి మారితే అది కాలేయ సమస్యకు సూచన కావచ్చు. కాలేయానికి వాపు రావడం లేదా బైల్ ఉత్పత్తిలో లోపం ఉండటం వల్ల ఇలా జరగవచ్చు. ఈ సమస్య ఫ్యాటీ లివర్ నుంచి లివర్ సిర్రోసిస్ వరకు దారితీయవచ్చు.

నల్లని మలం:

  • మలం నల్లగా మారడం చాలా తీవ్రమైన సమస్యకు సంకేతం. దీనిని మెలెనా అని కూడా అంటారు. ఇది జీర్ణనాళంలో ముఖ్యంగా అన్నవాహిక లేదా కడుపులో అంతర్గత రక్తస్రావం జరుగుతోందని సూచిస్తుంది. తీవ్రమైన కాలేయ వ్యాధులు, ముఖ్యంగా లివర్ సిర్రోసిస్ ఉన్నవారిలో ఇలాంటి రక్తస్రావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నల్లని మలం కనిపిస్తే తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.

ఎర్రని మలం:

  • మలం ఎర్రగా మారడం కూడా అంతర్గత రక్తస్రావానికి సంకేతం కావచ్చు. ఇది సాధారణంగా జీర్ణనాళం దిగువ భాగంలో రక్తస్రావం జరిగినప్పుడు కనిపిస్తుంది. కాలేయ సమస్యలతో పాటు..ఇతర జీర్ణ సంబంధిత వ్యాధుల్లో కూడా ఇలా జరగవచ్చు. తరచుగా మలం రంగులో ఇలాంటి మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ముదురు గోధుమ రంగు మలం:

  • మలం రంగు గోధుమ రంగులో ఉండటం సాధారణమే అయినప్పటికీ రంగు అసాధారణంగా ముదురుగా లేదా పాలిపోయినట్లుగా మారడం కూడా కాలేయ ఆరోగ్యానికి సంకేతం కావచ్చు.ఇది ఆహారపు అలవాట్ల వల్ల జరగవచ్చు. కానీ నిరంతరం ఈ మార్పు కనిపిస్తే కాలేయ పనితీరును ఒకసారి పరీక్షించుకోవడం మంచిది. అయితే పై లక్షణాలు కనిపించినంత మాత్రాన కాలేయ వ్యాధే అని నిర్ధారించుకోవద్దు. కొన్ని ఆహారాలు లేదా మందుల వల్ల కూడా మల రంగు మారవచ్చు. అయితే ఈ మార్పులు నిరంతరంగా ఉండి.. వాటితోపాటు అలసట, కామెర్లు, ఆకలి లేకపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సతో కాలేయాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:గుడ్డు తింటే మందే లేని రోగం.. షాకింగ్ రిపోర్ట్!

Advertisment
తాజా కథనాలు