తెలంగాణ మంత్రి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ చిన్న విషయం మీద స్పందిస్తూ ఉంటారు. తాజాగా సీడబ్లూసీ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల మీద మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ళ కపటకధలు, కంత్రీగోత్రాలు తెలంగాణ గడ్డలో అందరికీ తెలుసునని...కల్లబొల్లి గ్యారెంటీలు ఇక చెల్లవ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలకేయుల కాలం వస్తే కరెంట్ కోతలు...కటిక చీకట్లు గ్యారెంటీ అంటూ విమర్శించారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంట కరెంటే గతి అంటూ మండిపడ్డారు. బకాసురులు గద్దెన్నెక్కితే రైతు బీమా...ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ అంటూ ట్వీట్ చేశారు.
సమర్థతలేని సన్నాసులకు ఓటేస్తే
సకల రంగాల్లో సంక్షోభం గ్యారెంటీ..!
ఢిల్లీ కీలుబొమ్మలు కుర్చీఎక్కితే
ఆత్మగౌరవాన్ని అంగట్లో తాకట్టు పెట్టడం గ్యారెంటీ..!
దొంగల చేతికి తాళాలు ఇస్తే
సంపదనంతా స్వాహా చేయడం గ్యారెంటీ..!
భస్మాసుర హస్తాన్ని నెత్తిన పెట్టుకుంటే
బూడిద మిగలడం గ్యారెంటీ...!
స్కాముల పార్టీకి స్వాగతం చెబ్తే
స్కీములన్ని ఎత్తేయడం గ్యారెంటీ..!
కర్షకుడి కష్టం తెలియనోళ్లకు సీటిస్తే
అన్నదాత ఆగమైపోవడం గ్యారెంటీ..!
పరిపాలన చేతగాని..చేవలేనివాళ్లకు పగ్గాలిస్తే
పల్లెపల్లెనా మళ్లీ పల్లేర్లు మొలవడం గ్యారెంటీ..!
పనికిమాలిన వాళ్లు పవర్లోకి వస్తే
పరిశ్రమలు పారిపోవడం గ్యారెంటీ..!
బుద్ధికుశలత లేనోళ్లకు చోటిస్తే
భూముల ధరలు పడిపోవడం గ్యారెంటీ..!
విషయం..విజ్ఞానం లేనోళ్లను విశ్వసిస్తే
వికాసం మాయమై వినాశనం గ్యారెంటీ..!
థర్డ్ గ్రేడ్ నాలాయక్స్ ను నమ్ముకుంటే
ప్రథమ స్థానంలో వున్న స్టేట్ అధమస్థాయికిపోవడం గ్యారెంటీ..!
ఆర్థికశాస్త్రం తెలియని అరాచకులకు అవకాశం ఇస్తే
ఎకానమీ ఏట్లో గలవడం గ్యారెంటీ..!
జోకర్లకు..బ్రోకర్లకు పీఠం ఇస్తే
పరువు ప్రతిష్ఠలు గంగలో కలవడం గ్యారెంటీ..!
దాచి..దాచి దెయ్యాలకు పెట్టేంత
ఎడ్డిది కాదు..నా తెలంగాణ..!
ఈనగాచి నక్కల పాల్జేసేంత
అమాయక నేల కాదు నా తెలంగాణ..! అంటూ కాంగ్రెస్ ను చెరిగి పారేశారు. ఇలాంటి వాళ్ళను తెలంగాణ నమ్మదు అంటూ విమర్శించారు. కేటీఆర్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. చాలా కామెంట్లు పెడుతూ లైకులు కొడుతున్నారు.