రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్షా శిబిరం వద్ద పోలీసులు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం దీక్షా స్థలికి చేరుకున్న బీజేపీ శ్రేణులపై, రైతులపై పోలీసులు ఎందుకు లాఠీఛార్జి చేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం బీజేపీ నాయకురాలు డీకే అరుణ మహేశ్వర్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. మహిళ అని చూడకుండా అరుణను పోలీసులు ఈడ్చికెళ్లి అరెస్ట్ చేశారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్మల్ జిల్లా రైతులను ఆగం చేయాలని చూస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
మరోవైపు శనివారం పోలీసుల లాఠీఛార్జిలో సుమారు 30 మంది రైతులు, బీజేపీ శ్రేణులకు గాయాలయ్యాయన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నాయకుల్లా వ్యవహరిస్తోన్నారని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలపై నిలదీసిన వారిపై దాడులు చేస్తారా అని రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రశ్నించారు.
ప్రజా హక్కుల కోసం కొట్లాడే వారి గొంతు నొక్కుతున్నారన్న కిషన్ రెడ్డి.. అదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిపై పోలీసులు పైశాచికంగా దాడి చేశారన్నారు. మరోవైపు సీఎం పర్యటించే ప్రాంతాల్లో విపక్ష పార్టీలకు చెందిన నేతలను ముందస్తుగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగుతుందో.. కల్వకుంట్ల రాజ్యాంగం కొనసాగుతుందో అర్థం కావడంలేదన్నారు. కేసీఆర్ లంబాడి ఆడబిడ్డల శీలాన్ని శంకించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో సంచలనంగా మారిన మరియమ్మ లాకప్ డెత్ మీద ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. పోలీసుల వేధింపులతో ఖమ్మంలో బీజేపీ యువ నేత చనిపోతే ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు.