కేంద్రంలో అనూహ్యమైన పొత్తు కుదిరింది. ఎన్డీయే కూటమిలో జేడీఎస్ చేరింది. దీంతో ఎన్నికల సమీపిస్తున్న సమయంలో రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు అయింది. కర్ణాటకకు చెందిన జేడీఎస్ పార్టీ బీజెపీ సార్ధ్యంలో ఎన్డీయే కూటమిలో అధికారికంగా చేరింది. బీజెపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైన జేడీఎస్ నేత కర్ణాటక మాజీ సీఎంకుమారస్వామి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఇరు పార్టీలు పొత్తు చేసుకుంటాయని ఎప్పటి నుంచో ఊహాగానాలు సాగుతున్నాయి. వాటికి ఈరోజుతో తెరపడినట్లయింది. మరోవైపు జేడీఎస్ పార్టీ ఎన్డీయేలో చేరడంతో బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలినట్లయింది. జేడీఎస్ తమతో కలుస్తుందని కేసీఆర్ చాలా రోజుల నుంచి చెబుతున్నారు.
కర్ణాటక పార్టీ జేడీఎస్ ఎన్డీయే కూటమిలో చేరిన విషయం గురించి బీజెపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. జేడీఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందం కలిగించిందని చెప్పారు. ఆ పార్టీని హృదయపూర్వకంగా తన కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రధాని నరేంద్రమోదీ న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా విజన్ బలోపతం చేసినట్లు అవుతుందని నడ్డా అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చూసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎన్డీయే కూటమితో కలిసిందని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్, బీజెపీల మధ్య పొత్తు ఉంటుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. ఆ పార్టీకి మాండ్యతో పాటూ మరో మూడు టికెట్లు కూడా ఇస్తామని ఆయన చెప్పారు.