Pawan Kalyan Hot Comments: దండు పాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేదని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శనివారం పెందుర్తి నియోజకవర్గంలో వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని విచారం వ్యక్తం చేశారు.కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని అన్నారు. ఈ కేసులో వలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటపెట్టిన పోలీసులకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని అన్నారు. వారు ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, పాస్‌పోర్టు కావాలన్నా పోలీసు వెరిఫికేషన్ చేస్తారని.. వాలంటీర్ల నియామకంలో మాత్రం ఎలాంటి పోలీసు వెరిఫికేషన్ తీసుకోవడం లేదని అన్నారు. ఇదేమి విధానం అని పవన్ ప్రశ్నించారు. వ్యవస్థలను, శాంతి భద్రతలను కాపాడటం జనసేన బాధ్యత అన్నారు. దండుపాళ్యం బ్యాచ్ కు, వలంటీర్లకు తేడా లేకుండా పోతుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలు మిస్సింగ్ గురించి చెబితే.. నాపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలకు దిగారని మండిపడ్డారు. పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ కూడా ఇదే విషయం చెప్పింది అన్నారు. అలాగే విశాఖ నుంచి 151 మంది చిన్నపిల్లలు అదృశ్యమయ్యారని.. ఏపీలో హ్యుమన్ ట్రాఫికింగ్ జరుతుందని నోబెల్ గ్రహీత కైలాష్ సత్యర్థి చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని తాము కోరుకుంటున్నామని తెలిపారు. పోలీసులను వారి పనులను వారిని చేయనిస్తే.. నేరాలు తగ్గుతాయని, మంత్రులు, ఎమ్మెల్యే పోలీసు శాఖ చేతలు కట్టేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. జనసేన అద్భుతాలు చేస్తుందని తాను చెప్పడం లేదని.. వ్యవస్థలను మాత్రం సక్రమంగా పని చేయిస్తుందని మాత్రం చెప్పగలనని అన్నారు పవన్. విశాఖలో పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయని.. ఏపీలో శాంతిభద్రతల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.