ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య యుద్ధం మొదలై పదిహేను రోజులు అయింది. ఇన్ని రోజులుగా ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. హమాస్ మొదలెట్టిన మారణకాండను ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తోంది. గాజాలో దాక్కున్న మిలిటెంట్లను ఏరిపారేయాలని...వారి దగ్గర బందీలుగా ఉన్న తమ దేశస్థులను కాపాడుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇరు పక్షాలు వైమానిక దాడులను మాత్రమే చేసుకున్నారు. గాజా సరిహద్దుల్లో తమ యుద్ధ ట్యాంకర్లు, పదాధిదళపతులను మోహరించినప్పటికీ ఇప్పటివరకూ దాడి చేయలేదు. కానీ నిన్న ప్రత్యక్ష యుద్ధం జరిగిందని హమాస్ చెబుతోంది.
Also Read:కాంగ్రెస్ లోకి వివేక్, రాజగోపాల్ రెడ్డి?
తమ భూభాగంలోకి దూసుకొచ్చిన ఇజ్రాయెల్ మిలటరీకి చెందిన రెండు బుల్డోజర్లు, ఒక యుద్ధ ట్యాంకర్ ను ధ్వంసం చేశామని హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. తమ ెదురు దాడికి తట్టుకోలేక ఇజ్రాయెల్ సైన్యం వాహనాలను వదిలేసి సరిహద్దులకు కాలినడకన వెళ్ళారని తెలిపింది. ఖాన్ యూనిస్ సిటీలో ఇజ్రాయెల్ సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొన్నామని అల్ ఖసమ్ బ్రిగేడ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దీని మీద ఇజ్రాయెల్ కూడా స్పందించింది. దక్షిణ గాజాలో సెక్యూరిటీ ఫెన్స్ దగ్గర ఉన్న తమ బలగాల మీద స్వల్పంగా కాల్పులు జరిగాయని స్పష్టం చేసింది. కాల్పులు జరిపిన హమాస్ మిలిటెంట్ల మీద తమ యుద్ధ ట్యాంకుల నుంచి ప్రతిదాడి చేశామని తెలిపింది. అంతేకాదు గాజాలో తమ సైన్యం ఉందని స్పష్టం చేసింది. ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ మరో ముఖ్య నేత మహమ్మద్ కటామష్ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇక ఇరు వర్గాల మధ్య యుద్ధంలో అత్యధికంగా బలౌతున్న వారిలో యంగ్ అండ్ చిన్నారులే ఎక్కువగా ఉన్నారని పాలస్తీనియన్ స్వచ్ఛంద సంస్థ ఒకటి తెలిపింది. ప్రతీరోజూ వందమందికి పైగా చిన్నారులు చనిపోతున్నారని తెలిపింది. యుద్ధం వలన ఇప్పటి వరకు 3,400 మంది సామాన్యులు చనిపోగా...అందులో వెయ్యి మందికి పైగా పిల్లలు ఉన్నారు. గాజాలో అచ్చంగా నరమేధమే జరుగుతోందని ఢిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్-పాలస్తీనా అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. గాజాతో పోలిస్తే ఇజ్రాయెల్ లో చనిపోయింది తక్కువేనని చెప్పారు. ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడిలో 1400 మంది మృతి చెందగా...అందులో కేవలం 14 మంది మాత్రమే పిల్లలు ఉన్నారు.