USA-INDIA: అమెరికాను నమ్మొద్దు..బ్రిక్స్ లో చేరండి..భారత్ కు సలహా ఇచ్చిన యూఎస్ ఆర్థిక వేత్త

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాన్ని ఆ దేశపు ఆర్థిక వేత్తలే దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్ యూఎస్ పై ఎక్కువ ఆధారపడకుండా ఉండడమే మంచిదని ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ సలహా ఇచ్చారు. వారు బ్రిక్స్ లో చేరాలని సూచించారు. 

New Update
usa

PM Modi, USA President Trump

భారత్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర వ్యతిరేకత, విమర్శలు ఎదురౌతున్నాయి. సొంత దేశంలోనే ఇప్పటి వరకు చాలా మంది ఆయనకు వ్యతిరేకంగా మారారు. రష్యా నుంచి చమురు కొంటోందని భారత్ పై అదనపు సుంకాలు విధించడం ఎంత మాత్రం మంచి పని కాదని అంటున్నారు. భారత్ లాంటి మిత్ర దేశంతో గొడవ పెట్టుకుని ట్రంప్ తప్పు చేస్తున్నారని అంటున్నారు. తాజాగా యూఎస్ ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ కూడా అమెరికా అధ్యక్షుడి విధానాలపై విరుచుకుపడ్డారు. 

అమెరికాతో వద్దు..

భారత్...అమెరికాపై ఎక్కువ ఆధారపడకుండా ఉండడం మంచిదని ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ అంటున్నారు. వాషింగ్టన్ తో భద్రతా ఒప్పందాలు ఇక మీదట పని చేయవని చెబుతున్నారు. చైనా, భారత్ ల నుంచి అమెరికా ఇకపై ఎగుమతులు అంగీకరించదు కాబట్టి ఆ రెండు దేశాలు బ్రిక్స్ లో చేరాలని జెఫ్రీ సలహా ఇచ్చారు. ట్రంప్ చేసేవన్నీ తలతిక్క పనులే అని తిట్టిపోశారు. ఆయన ఆలోచించి ఏ పనీ చేయరని.. వ్యూహాత్మకంగా అస్సలు ఉండవని విమర్శించారు. భారతదేశం అమెరికాను తన ప్రధాన భాగస్వామిగా విశ్వసించకూడదని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని జెఫ్రీ చెప్పుకొచ్చారు. భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానంతో ముందుకు వెళ్ళాలని సూచించారు. 

చైనాకు మళ్ళీ 90 రోజుల విరామం ఎందుకు..

చైనా విషయంలో ట్రంప్ భయపడుతున్నారని జెఫ్రీ అన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటోందని భారత్ పై సుంకాలు విధించారు కానీ అంతకంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటున్న చైనాను మాత్రం వదిలేశారు ట్రంప్. దీనికి కారణం చైనా మొదట్లో తీసుకున్న చర్చలేనని అంటున్నారు జెఫ్రీ. మొదట్లో ట్రంప్ ఆ దేశంపై విపరీతమైన సుంకాలు విధించారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా టారీఫ్ లను వేసింది. చైనా అరుదైన ఎగుమతులను ఆపేసింది. దీంతో ట్రంప్ దెబ్బకు దిగొచ్చారు. అందుకే ఇప్పుడు చైనాకు మళ్ళీ 90 రోజుల విరామాన్ని ప్రకటించారని తెలిపారు. 

భారత్ విషయంలో ట్రంప్ తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించడానికి తపన పడుతున్నారు. కానీ అది చెల్లదు. రష్యా, భారత్, చైనాలు తనకు లోబడి ఉండాలని ట్రంప్ భావిస్తున్నారు. బ్రిక్స్ దేశాలను గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు. కానీ అది జరగదు. ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు అందులో అనేక అగ్రరాజ్యాలున్నాయి. ట్రంప్ ఆటలు చెల్లవు. భారత్ ఇలానే గట్టిగా నిలబడి..ఇతర దేశాలతో సంబంధాలను మెరుగు పరుచుకోవాలి. బ్రిక్స్ లో చేరడమే కాక తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ అభిప్రాయపడ్డారు.   

Also Read: War 2 Twitter Review: యాక్షన్ ప్రియులకు ఓకే కానీ..పాత సినిమాలో కొత్త క్యాస్టింగ్ అంతే..వార్ 2 ట్విట్టర్ రివ్యూ

Advertisment
తాజా కథనాలు