ప్రపంచ దేశాలు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాయి. కానీ ఉక్రెయిన్, రష్యా మాత్రం యుద్ధం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్రిస్మస్ పండుగ వేళ తాజాగా రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఖర్కీవ్ నగరంలో మిసైల్స్‌తో దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అక్కడి నగర మేయర్ ఇగోర్ టెరెకోవ్ వెల్లడించారు. '' ఖర్కీవ్ నగరంపై భారీగా మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి. బాంబుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. నగరం వైపు ఇంకా బాలిస్టిక్ క్షిపణులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం నష్టాన్ని అంచనా వేస్తున్నామని'' ఇగోర్ టెరెకోవ్ వెల్లడించారు.
Also Read: త్వరలో ఢిల్లీ సీఎం అరెస్ట్.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన!
మరోవైపు ఉక్రెయిన్ నుంచి తమవైపు వచ్చిన 59 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణశాఖ కూడా వెల్లడించింది. అయితే గత కొన్ని నెలలుగా తూర్పు ఉక్రెయన్‌లోకి రష్యా సైన్యం చొచ్చుకొని వెళ్తోంది. వచ్చే ఏడాది జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బాధ్యతలు చేపట్టేలోపే సాధ్యమైనంత ఎక్కువ ప్రాంతాన్ని తన అధీనంలో పెట్టుకోవాలని రష్యా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది చూసుకుంటే ఉక్రెయిన్‌కు చెందిన 190 ప్రాంతాలను ఆక్రమించుకున్నామని రష్యా ప్రకటన చేసింది. మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్ మానవ వనరులు, ఆయుధాల కొరతను ఎదుర్కొంటోంది. దీంతో జెలెన్‌స్కీ సైన్యం దూకుడు తగ్గిపోయింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఇటీవలే పుతిన్ ప్రకటించారు. దీనికోసం ఎవరితోనైనా చర్చలకు సిద్ధమని చెప్పారు. అలాగే ఎలాంటి షరతులు కూడా పెట్టబోమన్నారు. కానీ జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు
గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాను అధ్యక్షుడిని అయితే ఈ యుద్ధాన్ని ఆపుతానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. చివరికి ట్రంప్ గెలవడంతో మరి ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ఆసక్తి నెలకొంది. యుద్ధం ఆగుతుందా ? లేదా ఇంకా తీవ్రమవుతుందా ? అనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.