Inida-US Trade Deal: 18 శాతానికి టారిఫ్‌లు తగ్గింపు.. భారత్‌కు లాభనష్టాలేంటో తెలుసా ?

ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
India-US Trade Deal

India-US Trade Deal

ఇటీవల భారత్, అమెరికా(usa) మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్‌పై ఉన్న టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ట్రంప్ భారత్‌పై 25 శాతం టారిఫ్‌ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రష్యా నుంచి భారత్‌ ఆయిల్ కొనుగోలు చేస్తుందన్న కారణంతో మరో 25 శాతం టారిఫ్‌ విధించారు. మొత్తంగా భారత్‌పై 50 శాతం టారిఫ్‌ విధించడంతో ఇరుదేశాల మధ్య వాణిద్య ఉద్రిక్తతలు కొనసాగాయి. తాజాగా ట్రంప్‌ ఈ టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్‌కు కలిగే లాభనష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read :  ట్రంప్‌ టారిఫ్‌ల తగ్గింపు.. మౌనం పాటిస్తున్న మోదీ, పుతిన్

లాభాలు

టారిఫ్‌ల తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పొచ్చు. 50 శాతం పన్ను వల్ల ఇప్పటివరకు అమెరికా మార్కెట్లో ఈ భారత వస్తువులు ఖరీదైనవిగా మారాయి. ఇప్పుడు 18 శాతానికి తగ్గడం వల్ల మన వస్తువుల ధరలు తగ్గి, అమ్మకాలు పెరుగనున్నాయి. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో చైనా వస్తువులపై 34 శాతం, బంగ్లాదేశ్ వస్తువులపై 20 శాతం పన్నులు ఉన్నాయి. భారత్‌కు కేవలం 18 శాతం పన్ను ఉండటంతో అంతర్జాతీయ పోటీలో చూసుకుంటే భారత్ ముందుంటుంది. అమెరికాకు ఎగుమతి చేసే జెనరిక్ మందులు అలాగే ఐటీ సేవలపై ఇప్పటిదాకా అనిశ్చితి నెలకొంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఉండదు. ఇది భారతీయ కంపెనీల షేర్ల ధరలు పెరగడానికి, పెట్టుబడులు వచ్చేందుకు ఎంతగానో దోహదపడుతుంది.

బలపడనున్న రూపాయి

ట్రంప్ ప్రకటన తర్వాత మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 119 పైసలు పెరిగి రూ.90.30 వద్దకు చేరుకుంది. అంతకుముందు ఇది రూ.91.50 పైన ఉండేది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు సైతం భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. పెట్టుబడులు పెరిగితే డాలర్ల ప్రవాహం పెరిగి, రూపాయి విలువ పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలాన్ని కొలిచే 'డాలర్ ఇండెక్స్'  ఇప్పుడు 0.20 శాతం తగ్గి 97.43 వద్ద ట్రేడవుతోంది. అంటే అంతర్జాతీయంగా కూడా డాలర్ స్వల్పంగా బలహీనపడుతోంది.

Also Read :  షేక్ హ‌సీనాకు బిగ్‌షాక్.. ప‌దేళ్లు జైలుశిక్ష‌

నష్టాలు 

అమెరికా-భారత్‌ వాణిజ్య ఒప్పందం ప్రకారం.. భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్‌లను క్రమంగా సున్నా కి తగ్గించాల్సిన పరిస్థితి రావొచ్చు. దీనివల్ల దేశీయంగా ఉన్న చిన్న పరిశ్రమలు అమెరికా ఉత్పత్తులతో పోటీ పడాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చే చమురును వదులుకుని, అమెరికా, వెనెజువెలా నుంచి కొనడం వల్ల దేశంలో ఇంధన ధరలపై స్వల్ప ప్రభావం పడే ఛాన్స్‌ ఉంటుంది. కానీ అమెరికా కూడా భారత్‌కు ప్రత్యేక రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చింది.

మరోవైపు అమెరికా తన వ్యవసాయ ఉత్పత్తులను అంటే డైరీ, పప్పు ధాన్యాలను భారత మార్కెట్లోకి పంపాలని కోరుతోంది. ఇది భారతీయ రైతుల ఆదాయంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ మొత్తంగా చూస్తే.. ఈ నిర్ణయం భారత ఎగుమతి రంగానికి ఊరట కల్పించనుంది. పన్ను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక భారీ బూస్టర్ డోస్ లాంటిదని నిపుణులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు