/rtv/media/media_files/2026/02/11/bangladesh-elections-2026-02-11-16-13-02.jpg)
Bangladesh Elections
బంగ్లాదేశ్‌లో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. రేపు (గురువారం) దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు(Bangladesh elections) జరగనున్నాయి. 300 పార్లమెంటరీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2024లో ఆగస్టులో చెలరేగిన ఉద్యమం వల్ల అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికే షేక్ హసీనాపై అనేక కేసులు నమోదయ్యాయి. అలాగే అవామీ లీగ్ పార్టీని కూడా ఇటీవల యూనస్ ప్రభుత్వం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. షేక్ హసీనా ఇక్కడ లేకపోవడం, అవామీ లీగ్ పార్టీ పోటీ చేయకపోవడంతో ఈ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఏ పార్టీలో పోటీలో ఉన్నాయి ?
మాజీ ప్రధాని ఖలేదా జియా కొడుకు తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) బరిలోకి దిగింది. ఇక గతంలో BNP పార్టీకి మిత్రపక్షంగా ఉన్న జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ.. ఈసారి నేషనల్ సిటిజన్ పార్టీ లాంటి పార్టీలతో కూటమిగా ఏర్పడింది. మొత్తం 11 పార్టీల కూటమితో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇంకా మరికొన్ని ఇతర పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.
Also Read: 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు చేసిన ఎప్‌స్టీన్.. కారణం ఇదే !
ఎవరి బలం ఎంత
ప్రస్తుత అంచనాల ప్రకారం BNP విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జమాత్-ఏ-ఇస్లామీ కూటమికి కూడా అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది . అవామీ లీగ్ మద్దతుదారులు ఎవరికి ఓటేస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. వీళ్ల ఓట్లు కూడా ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనున్నాయి. ఒకవేళ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మెజారిటీ సాధిస్తే.. ఆ పార్టీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఈయన మాజీ ప్రధాని ఖలేదా జియా కొడుకు. దాదాపు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత 2025 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ జమాత్-ఏ-ఇస్లామీ నేతృత్వంలోని కూటమి మెజార్టీ సాధిస్తే.. ఆ పార్టీ అధినేత డాక్టర్ షఫీకర్ రెహమాన్ ప్రధాని పదవికి ప్రధాన రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
పోలింగ్ వివరాలు
ఫిబ్రవరి 12న ఉదయం 7:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు కూడా రేపు రాత్రి నుండి వెలువడుతాయి. ఫిబ్రవరి 13 ఉదయం అధికారికంగా ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఈసారి ఓటర్లు కేవలం ఎంపీలనే కాకుండా.. రాజ్యాంగ మార్పులపై కూడా తమ అభిప్రాయాన్ని చెప్పాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సుమారు 12.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో యువత (Gen Z) ఓట్లు కీలకంగా మారనున్నాయి. 300 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మరో 50 స్థానాలు మహిళా రిజర్వ్డ్ సీట్లు. వీళ్లను 300 స్థానాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఎన్నుకుంటారు. ప్రభుత్వ ఏర్పాటుకు 151 సీట్ల మెజార్టీ రావాలి. రాజ్యాంగ సవరణలు చేయాలంటే కనీసం 200 సీట్లు సాధించాలి.
Also Read: అమెరికా మమ్ముల్ని వాడుకుంది.. పాకిస్థాన్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై ముఖ్యంగా హిందువులపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా టూరిస్టు వీసాలపై ఆంక్షలు విధించింది. మరోవైపు ఇటీవల యూనస్ ప్రభుత్వం పాకిస్థాన్, చైనాకు దగ్గరయ్యింది. ఈసారి ఎన్నికల్లో గెలిచే పార్టీ భారత్‌కు అనుకూలంగా ఉంటుందా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
Follow Us