కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఐరోపా రాజకీయ నేతలను, ప్రవాస భారతీయులను కలిసేందుకు వెళ్ళిన రాహుల్ గాంధీ ఫ్రాన్స్ లో ఓ యూనివర్శిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... ఇండియా, భారత్ ఏ పేరైనా తనకు ఆమోదయోగ్యమేనని తెలిపారు. రాజ్యాంగంలో రెండు పేర్లనూ ప్రస్తావించారు కాబట్టి ఏది పెట్టినా పర్వాలేదని ఆయన అన్నారు. ఇండియాగా పిలబడుతున్న భారత్ అనేక రాష్ట్రాల సమూహమని ఆయన పేర్కొన్నారు.
బీజెపీకి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమికి ఇండియాగా పేరు పెట్టడం వలనే అధికార ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రాహుల్ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. వారికి మేము పెట్టిన పేరు విసుగు కలిగించిందని ఆయన అన్నారు. చెప్పి ఉంటే తాము తమ కూటమికి వేరే పేరు పెట్టేవారని కూడా అన్నారు. అయితే దాని వలన పెద్ద ప్రయోజనం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు అని రాహుల్ కామెంట్ చేశారు.
అయితే ఇండియా పేరును భారత్ గా మార్చడం మీద రాహుల్ కాకుండా మిగతా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజల నుంచి కూడా ఈ విషయం మీద విమర్శలు వస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన జీ20 సమావేశాల అతిధులకు భారత రాష్ట్రపతి పంపిన డిన్నర్ అహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో దేశం పేరు మార్పు వెలుగులోకి వచ్చింది.