కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సీఈసీ సభ్యులతో ఏఐసీసీ నేతలు ఒంటరిగా మాట్లాడాని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిపాదించారన్న ఆయన.. దానికి అందరం ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రంలో సమర్థవంతమైన వాళ్లకే టికెట్లు ఇస్తామని ఎంపీ తెలిపారు. నల్గొండ, భువనగిరి నియోజకవర్గాల్లో కలిసి 10 అప్లికేషన్‌లు వచ్చాయని ఆయర వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం అందరి బలా బలాలు పరిశీలించే టికెట్లు ఇస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డీ.. అభ్యర్థుల ప్రకటనకు ముందు కేటీఆర్ అమెరికాకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. తాను సీటు ఇస్తానని ఎంత మందికి హామి ఇచ్చారో అన్న ఆయన.. సీటు రాని వారు కేటీఆర్‌ను ప్రశ్నిస్తారు కాబట్టే తప్పించుకువేళ్లారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ అనేక మందిని మోసం చేశారన్నారు. సీటు ఆశించి మోసపోయిన వారు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలం పెరగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతామని సూచించారు. ప్రతీ గ్రామంలోకి వెళ్లి సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని వాటిలో ఎన్ని నెరవేర్చారో తెలియజేస్తామని, అంతేకాకుండా బీఆర్‌ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో చేసిన మోసాల గురించి, ప్రభుత్వ నేతల దోపిడీల గురించి గడప, గడపకు తిరుగుతూ వివరిస్తామన్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయ్యే పథకాల గురించి వివరిస్తూ వాటికి సంబంధించిన గ్యారెంటీ కార్డులు సైతం అందజేస్తామని ఎంపీ పేర్కొన్నారు.