/rtv/media/media_files/2025/08/26/husband-harasses-wife-for-dowry-2025-08-26-10-21-05.jpg)
Husband harasses wife for dowry
కట్నం(Dowry) కోసం ఓ భర్త తన భార్యని దారుణంగా హింసించాడు(Harassment). ఆమెని తాళ్లతో కట్టేసి, వేడి చేసిన కత్తితో కాల్చి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని ఖర్గాన్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 23 ఏళ్ల బాధితురాలు ఖుష్బూ పిప్లియాను ఆమె భర్త దారుణంగా హింసించాడు. ఈ దారుణానికి కారకుడైన భర్త తాగిన మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
Dowry Harassment
ఆదివారం రాత్రి తనను మొదట కాళ్లతో తన్ని, ఆ తర్వాత వంటగదిలోకి ఈడ్చుకెళ్లాడని తెలిపింది. అక్కడ తన చేతులు, కాళ్లను తాళ్లతో గట్టిగా కట్టేసి, ఒక తుపాకీలాంటి వస్తువును తన తలకు పెట్టి బెదిరించాడని వెల్లడించింది. ఆ తర్వాత వేడి చేసిన కత్తితో తన శరీరంపై, చేతులు, కాళ్లపై పలు చోట్ల కాల్చి గాయపరిచాడని వాపోయింది. అంతేకాదు ఆమె నోట్లో కత్తి పెట్టి కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశాడట. తన తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేశారని, అందుకే తాను ఇష్టం లేని భార్య అని, తనకు కట్నం కావాలని తన భర్త పదేపదే అన్నాడని ఆమె తెలిపింది. ఈ దారుణం జరుగుతున్న సమయంలో ఇంట్లో తన అత్తింటి వారు కూడా ఉన్నారని, కానీ ఎవరూ అడ్డుకోలేదని బాధితురాలు వివరించింది.
దాడి తర్వాత, తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఖుష్బూ ఎలాగోలా తప్పించుకుని, ఇంటి పనిమనిషి ఫోన్ తీసుకుని తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, ఆమెను అవార్‌కచ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కట్నం వేధింపులు, క్రూరమైన దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.