Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్టులు.. సాక్షులు ఎందుకు మాట మార్చారు ? కారణం అదేనా

కర్ణాటకలో వెలుగుచూసిన ధర్మస్థల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు దీనిపై ఫిర్యాదులు చేసినవారే ఇప్పుడు మాట మారుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Dharmasthala Case

Dharmasthala Case

కర్ణాటక(Karnataka) లో వెలుగుచూసిన ధర్మస్థల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు దీనిపై ఫిర్యాదులు చేసినవారే ఇప్పుడు మాట మారుస్తున్నారు. 1995-2014 మధ్య వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టానని భీమా అనే మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతుల్లో చాలామంది అమ్మాయిలే ఉన్నారని వాళ్లపై అత్యాచారం, హత్య జరిగినట్లు గుర్తులు గమనించానని చెప్పాడు. తాను చెప్పిన విషయానికి ఆధారంగా ఓ పుర్రెను కూడా సిట్ అధాకారులకు ఇచ్చాడు. దీంతో సిట్‌ అధికారులు అతడు చెప్పిన ప్రాంతంలో తవ్వకాలు జరపగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. కానీ ఇప్పుడు భీమా మాట మార్చాడు. తనకేం తెలియదంటూ చేతులెత్తేశాడు. ఎవరో తనకు పుర్రెను ఇచ్చి సిట్ అధికారులకు దీన్ని ఆధారంగా ఇవ్వాలని చెప్పారని తెలిపాడు. దీంతో సిట్‌ అధికారులు భీమాను అరెస్టు చేశారు. ధర్మస్థలకు చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేశాడనే అభియోగంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్‌ సేవలు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఇక ఈ వ్యవహారంలో సుజాత భట్‌ ఆరోపణలు కూడా కీలకంగా మారాయి. తన కూతురు ధర్మస్థలలో మిస్‌ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈమె ఇప్పుడు తనకు అసలు కూతురే లేదని చెబుతోంది. తాను చెప్పిందంతా కట్టు కథ అని చెబుతోంది. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ధర్మస్థలపై తప్పుడు ఆరోపణలు చేసిన దానిపై అసలు విషయాన్ని బయటపెట్టారు. 2003లో తన కూతురు మిస్‌ అయినట్లు చెప్పిన కథ కల్పితమని తెలిపారు. ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.. ''2003 మేలో నా 18 ఏళ్ల కూతురు అనన్య భట్ ధర్మస్థలకు వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమె గురించి తెలుసుకునేందుకు నేను ప్రయత్నిస్తే నన్ను కిడ్నాప్ చేశారు. ధర్మస్థలకు తిరిగిరావొద్దని, ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడొద్దని బెదిరించారు. నాపై దాడి కూడా చేశారు. కోమాలోకి వెళ్లిపోయాను. నెలరోజుల పాటు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్నానని'' సుజాత భట్‌ పోలీసులకు చెప్పారు.  

కానీ ఇప్పుడు సుజాత మాట మార్చారు. ఈ కేసులో ఇద్దరు ప్రముఖ కార్యకర్తలు గిరీష్ మట్టన్నవర్, టీ జయంతి తనను ఈ కట్టుకథ పోలీసులకు చెప్పమన్నారని తెలిపారు. ఇలా పోలీసులకు కట్టుకథ చెప్పినందుకు తాను ఎవరినుంచి నుంచి డబ్బులు తీసుకోలేదని చెప్పారు. మా తాతకు చెందిన కొంత భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు కబ్జా చేశారని.. మా సంతకాలు లేకుండానే దాన్ని లాక్కున్నారన్నారు. ఆ ఆస్తి విషయం తేల్చుకునేందుకే అలా చెప్పాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇప్పుడు సిట్ అధికారులకు సుజాత భట్ అసలు తనకు కూతురే లేదని చెప్పారు. తన కూతురు మిస్‌ అయనట్లు చూపించిన ఫొటోలు కూడా కల్పితమేనని తెలిపారు. చివరికి తాను తప్పు చేసినట్లు అర్థమైందని అందుకే ఇప్పుడు బయటకు వచ్చి నిజం చెప్పానన్నారు. 

బలమైన వ్యక్తుల హస్తం ఉందా 

ధర్మస్థల కేసు(Dharmasthala Case) లో ఇలా మలుపు తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇటీవల దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినవారే ఇప్పుడు మాట మార్చడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్లు అలా మాట మార్చేందుకు ఎవరైనా వెనకనుంచి బలమైన వ్యక్తులు హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లని బెదిరించి, భయపెట్టి ఇలా చేయిస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. వాళ్ల కుటుంబాలను కాపాడుకునేందుకు భీమా, సుజాత భట్‌ మాట మార్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు సాక్షులను ప్రభావితం చేసేందుకు వాళ్లకు భారీగా డబ్బు ఆశ కూడా చూపించి ఉండవచ్చు. 

Also Read: స్నేహితుడు సినిమా రిపీట్.. వైద్యుడి వీడియో కాల్‌తో ఇంట్లోనే భార్యకు ప్రసవం చేసిన భర్త

కేసు క్లోజ్ చేస్తారా 

ఈ కేసు వ్యవహారంలో దర్యాప్తు సరిగ్గా జరగలేదని అసలు నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సాక్షులు న్యాయంపై నమ్మకం కోల్పోయి దర్యాప్తుపై సహకరించేందుకు నిరాకరించవచ్చు. అయితే సుజాత భట్‌ తన కూతురిది ఫేక్ ఫొటోను చూపించినప్పుడు.. రంగంలోకి దిగిన పోలీసులు కూడా ఆమె ఆచూకి గురించి ఏం తెలుసుకోలేకపోయారు. సాక్షులు మాట మార్చడం వెనుక  రాజకీయ, వ్యాపారవేత్తల హస్తం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ కేసును త్వరలోనే క్లోజ్‌ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ధర్మస్థల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. కొందరు దీన్ని కొట్టిపారేస్తుంటే మరికొందరు మాత్రం ఇది నిజంగానే జరిగి ఉంటుందని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు