Supreme Court: కంగనా రనౌత్‌కు సుప్రీంకోర్టు తిట్లు.. మసాలా కలిపారంటూ ఫైర్

పంజాబ్‌లో నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ధర్మాసనం "మీరు ఆ ట్వీట్‌కు మసాలా జోడించారు" అంటూ కంగనాకు చివాట్లు పెట్టింది. రైతులు చేపట్టిన నిసరనలో ఆమె మహిళా రైతుని కించపరుస్తూ ట్వీట్ చేశారు.

New Update
kangana

బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతు నిరసనలపై చేసిన వివాదాస్పద ట్వీట్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై పంజాబ్‌లో నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం "మీరు ఆ ట్వీట్‌కు మసాలా జోడించారు" అంటూ కంగనాకు చివాట్లు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 సంవత్సరంలో రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ ఓ ట్వీట్ చేశారు. అందులో వృద్ధురాలైన మహిళా రైతును రూ.100 కోసం నిరసనల్లో పాల్గొన్నట్లు కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌పై రైతులు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో పంజాబ్‌లోని భటిండా జిల్లాలో ఆమెపై పరువు నష్టం, ఇతర ఆరోపణల కింద క్రిమినల్ కేసు నమోదైంది.

ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ కంగనా మొదట పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం కంగనా న్యాయవాది వాదనలను విన్నది. "ఇది కేవలం ఒక ట్వీట్ కాదు, మీరు దీనికి అనవసరమైన 'మసాలా' జోడించి రైతులను అవమానపరిచారు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల అనంతరం కంగనా పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో కంగనా రనౌత్ ఇప్పటివరకు పదే పదే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించినా, ఆమెకు నిరాశే ఎదురవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదం మరింత పెద్దది అయ్యే అవకాశముంది.

#latest-telugu-news #defamation-case #tweet #Supreme Court #kangana-ranaut #actress-kangana-ranaut #kangana #kangana-ranaut-news
Advertisment
తాజా కథనాలు