/rtv/media/media_files/2025/10/02/kanatara-2025-10-02-09-26-32.jpg)
రెండేళ్ళ క్రితం కాంతారా మూవీతో ఓ సంచలనాన్నే సృష్టించాడు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. ఎవరికీ తెలియని కొత్త కథ, అద్భుతమైన విజువల్స్, అంతకు మించిన నటనతో అందరినీ కట్టిపడేశాడు. ఇప్పుడు దానికి ప్రాక్వెల్ అంటూ కాంతారా చాప్టర్ 1 సినిమాను రిలీజ్ చేశాడు. దసరా రోజున ఈ సినిమా విడుదల అయింది. తన తండ్రి మాయం అయిపోయిన చోటనే తాను మాయం అయిపోవడంతో కాంతారా సినిమా ముగుస్తుంది. అసలు అక్కడే అందరూ ఎందుకు మాయం అవుతున్నారు. దానికి పూర్వం కథ ఏంటి అనేదే కాంతారా చాప్టర్ 1 కథ అని ముందే చెప్పిన రిషబ్...దీన్ని ఓ మైథాలజికల్, హిస్టారికల్ సినిమాగా తెరకెక్కించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? వెండితెర మీద ఎలాంటి అద్బుతాను చేసింది. మొదటి సినిమాలా ఇది కూడా హిట్ కొట్టిందా...ఇప్పుడు చూద్దాం.
కథ..
కాంతారా చాప్టర్ 1 అంతా పూర్వకాంలో జరుగుతుంది. 8వ శతాబ్దంలో కదంబుల రాజ్యపాలన సమయంలో జరిగే కథ ఇది. ఈ రాజ్యంలో ఒకవైపున కాంతారా దైవ భూమి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఈశ్వరుడి పూదోట, మార్మిక బావి చాలా మహిమగలవి. వాటిని కాపాడుకుంటూ..తమ ప్రాంతంలోకి ఎవరూ అడుగుపెట్టకుండా చూసుకుంటుంటారు కాంతారా ప్రజలు. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాల్ని పండిస్తూ జీవనం సాగించే ఆ తెగకు.. అక్కడున్న బావిలో ఓ బిడ్డ దొరుకుతాడు. అతనే రిషబ్ శెట్టి. బెర్మే అనే పేరు పెట్టి గిరిజన తెగ అతడిని పెంచుతుంది. పెరిగి పెద్ద అయి తమ కాంతారాను కాపాడుతుండడమే కాకుండా..తమ సుగంధ ద్రవ్యాలతో ఎలా విదేశీ వర్తకం చేస్తున్నారో.. గిరిజనుల్ని వెట్టి పేరుతో ఎలా హింస పెడుతున్నారో తెలుసుకుంటాడు. దీంతో తమ తెగను బాగు చేయాలనే సంకల్పంతో భాంగ్రా రాజును ఎదిరిస్తాడు. సొంతంగా వ్యాపారం చేసేందుకు సిద్ధమవుతాడు. దీని తరువాత ఏమైంది అన్నదే మొత్తం సినిమా అంతా. బెర్మే తీసుకున్న నిర్ణయం కాంతార గిరిజన తెగకు ముప్పుగా ఎందుకు మారింది?భాంగ్రా రాజు రాజశేఖర్ (జయరామ్) ఆయన కుమార్తె కనకావతికి (రుక్మిణి వసంత్) ఈ కథలో ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈశ్వరుడి పూదోటకు, బెర్మేకు ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ..
కాంతారా మొదటి సినిమాకు ఉన్న సంబంధం చెబుతూనే...అప్పటి గిరిజన తెగతో ఈశ్వరుని పూదోటకు ఉన్న అనుబంధం ఏంటి? ఆ స్థలానికి, మార్మిక బావికి ఉన్న మహత్తులు ఏంటి..పంజుర్లి, గులిగ తదితర దైవిక గణాల కథేంటి అన్నది సినిమాలో చూపించడానికి ప్రయత్నం చేశారు. మొదటి సినిమాలానే రిషబ్ శెట్టి చాప్టర్ 1లో కూడా ప్రేక్షకులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టడంలో సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. సినిమా మొదటి నుంచి కూడా 8వ శతాబ్దంలో రాజులను, గిరిజన తెగలను పరిచయం చేస్తారు. గిరిజన తెగలను రాజు ఎలా అణిచి వేశాడన్నది చాలా ఆసక్తికరంగా చూపించారు. అక్కడే పరిచయమయ్యే ఈశ్వర గణాల కథ థ్రిల్ పంచుతుంది. బెర్మే సొంతంగా వ్యాపారం చేయడానికి సిద్ధం అవడంతో కథ మలుపు తిరుగుతుంది. దీని తరువాత ఇంటర్వెల్. అంతకు వచ్చే టైగర్ సీక్వెన్స్... కడపటి దిక్కు అసురజాతితో హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత కథంతా కూడా పరుగులు పెడుతూ..ప్రేక్షకులను ట్రాన్స్ లోకి తీసుకెళుతుందని అంటున్నారు. సినిమా అంతా రిషబ్ రుద్రతాండవం ఆడించేశాడని చెబుతున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి శుభం వరకు అయితే చెప్పడానికి మాటల్లేవని..ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని రివ్యూలు ఇస్తున్నారు. ఈ సీన్స్ మొత్తం దైవత్వంతో నిండిపోయి ఉన్నాయని...అంతా ఈశ్వర సాక్షాత్కారమేనని చెబుతున్నారు. పతాక ఘట్టాల్లో చండికలా రిషబ్ విజృంభించే తీరు రొమాంచితంగా ఉందని... కాంతార: చాప్టర్ 2 కి లీడ్ ఇస్తూ సినిమాని ముగించిన తీరు ప్రేకక్షకులను సంతృప్తినిచ్చిందనే చెప్పాలి.
మొదటి సినిమాలానే కాంతారా చాప్టర్ 1 కూడా రిషబ్ వన్ మ్యాన్ షో. దర్శకుడిగా, నటుడిగా విజృంభించేశాడు. ముఖ్యంగా రుద్ర గులిగలా.. ఈశ్వర గణంలా.. చండికలా తెరపై రిషబ్ చేసిన విన్యాసాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. కనకావతి పాత్రలో రుక్మిణీ అందంగా కనబడటమే కాకుండా..భిన్న కోణాల్లో ప్రేక్షకులను ఆశ్చపరిచింది. జయరామ్ పాత్ర కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు.
సినిమాలో మొదటి పార్ట్ అంతా కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపించింది. అక్కడక్కడా నవ్వులు పూయించినా కొంత బోర్ కూడా కొట్టింది. అదొక్కటే సినిమాకు మైనస్. ఇంటర్వెల్, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో మాత్రం విశ్వరూపం చూపించేశారు. ఫైట్స్, టైగర్ సీక్వెన్స్ గూస్ బంప్స్ తెప్పించేవిగా ఉన్నాయి. విజువల్ వర్క్స్, కెమెరా పనితీరు ఎప్టిలానే కట్టిపడేశాయి. వీటన్నిటికి తోడు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. మొత్తానికి కాంతారా చాప్టర్ 1తో రిషబ్ శెట్టి ప్రేక్షకులకు ఈశ్వర దర్శనం చేయించేశాడు.
Also Read: BIG BREAKING: న్యూ యార్క్ లో ఘోర ప్రమాదం...ఎయిర్ పోర్ట్ లో ఢీకొన్న రెండు విమానాలు